
శ్రీకృష్ణభక్తుడు, ప్రముఖ వాగ్గేయకారులు సద్గురు నారాయణ తీర్థుల వారి జయంతిని పురస్కరించుకుని సంస్కారభారతి, ఆంధ్రప్రదేశ్ వారు విజయవాడలో స్వరతరంగ యాత్రను నిర్వహించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నుంచి శ్రీకృష్ణతీర్ధుల వారి వేషధారణ మరియు గాత్ర తరంగగానంతో బయలుదేరారు. వారి జన్మస్థలమైన కాజ గ్రామంలోని వారి మందిరంలో భజన సాంప్రదాయ బృందగానం చేశారు.

ఈ సందర్భంగా అఖిల భారత సంస్థ సంస్కార భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్ మాట్లాడుతూ కళలు ఘన వారసత్వ సంపదకు ప్రతీకలని, వాటిని పరిరక్షించుకుని తద్వారా సమాజ హితం కోసం అఖిల భారత సంస్థ సంస్కార భారతి పాటుపడుతుందని అన్నారు.
భజన సమాజంలోని అందరినీ చైతన్యపరచి సంఘటితపరిచే ఒక అద్భుతమైన కళాసాంప్రదాయం, దానిని సంగీత, నృత్య ప్రక్రియలతో తరంగాల రూపంలో అందించిన సద్గురువు శ్రీ నారాయణ తీర్థులని శ్రీ శ్రీనివాస్ అన్నారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం భజన సాంప్రదాయం కనుమరుగవడమే కాక, ఆ మాటకు వేరే కుటిల అర్థం వచ్చేపదంగా మార్చడం సంస్కృతిపైన తద్వారా సమాజంపైన తెలియకుండా జరుగుతున్న దాడిగా గ్రహించాలని శ్రీ శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సెన్సార్ బోర్డు సలహా సంఘ సభ్యులు శ్రీ గూటాల రామకుమార్, ప్రముఖ రంగస్థల నటుడు శ్రీ వివిఎన్ కృష్ణ తెలుగు సంస్కృత అకాడమీ సభ్యులు శ్రీ కప్పగంతుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.





