దేశ రక్షణ, భద్రత వంటి అంశాలకు సంబంధిం చి ప్రజలలో, రాజకీయ పక్షాలలో ఏకాభి ప్రాయం అత్యవసరం. అలా లేని పక్షంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి జరుగుతున్న రభసను మొన్నటి వరకు రాజకీయ ప్రయోజనాల కోసం చెలరేగుతున్న వివాదంగా భావిం చాము. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న వాదనలతో పలు అనుమానాలకు అవకాశం ఏర్పడింది, దాంతో రాజకీయ లబ్ది కోసం ప్రతిపక్షాలు వివాదం రేపుతున్నాయని భావించాము. గతంలో బోఫోర్స్ వివాదం రాజీవ్ గాంధీకి ఏ విధంగా ఉపయోగ పడింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాఫెల్ నుండి ప్రయోజనం పొందాలని చూడటంలో తప్పు పట్టలేము. అయితే, సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత, ఇందులో అంతా సక్రమంగా జరిగిందని స్పష్టం చేసిన తర్వాత, తాము లోతుగా పరిశీలించా మని-అనుమానించదగిన అంశాలను ఏవీ లేవని చెప్పిన తర్వాత కూడా ఇంకా వివాదం సద్దుమణగక పోవడం గమనిస్తే- ఈ వివాదం వెనుక లోతైన కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ కుట్రలో రాజకీయ పార్టీలు పావులుగా మాత్రమే ఉన్నాయని భావించవచ్చు.
మన దేశం సైనికపరంగా బలపడటం ఇష్టం లేని అంతర్జాతీయ శక్తులు ఇటువంటి అనుమానాల వ్యాప్తికి ప్రయత్నం చేస్తున్నట్లు భావించవలసి వస్తున్నది. మరోవంక రక్షణ వ్యవస్థలో ప్రైవేట్ రంగం ప్రవేశిస్తే ఏడు దశాబ్దాలుగా తమ అసమర్ధతతో దేశానికి ఎంత నష్టం కలిగించామో వెల్లడి అవుతుందనే ఆందోళనతో ప్రభు త్వరంగ సంస్థలు భయానక పరిస్థితులు సృష్టిస్తున్నాయని చెప్పవలసి ఉంటుంది. రెండు దేశాల మధ్య జరిగే ప్రధానమైన రక్షణ సంబంధ ఒప్పందాలు ఆయా దేశాల విదేశాంగ విధాన లక్ష్యాలకు లోబడి ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. కేవలం ఒక అంశానికి పరిమితం కాకుండా విస్తృతమైన ప్యాకేజీని ఆమోదిస్తూ ఒప్పందాలు చేసుకొంటూ ఉంటాయి. అటువంటి ఒప్పందాలను సాధారణ వాణిజ్య ఒప్పందాల వలే చూడడం తగదు. అందుచేత ఇటువంటి ఒప్పందాలలో అంగీకరించే అనేక అంశాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉంటాయి. వాటిని ఎప్పటికీ బహిరంగ పరచరు.
భారతదేశం రాఫెల్ విమానాలను కేవలం విమా నాలుగా కాకుండా సమగ్ర పోరాట వ్యవస్థను సమ కూర్చుకొనే వ్యూహంలో భాగంగా కొనుగోలు చేస్తున్నది. వాటి ద్వారా చేరవేసే ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రాడార్లు అత్యంత ముఖ్యమైనవి అవుతాయి. వాటిని సమకూర్చుకోవడాన్ని బట్టి వ్యూహాత్మకంగా వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది. అవి ఏ విధంగా పనిచేస్తాయన్నది చాలా రహస్యంగా ఉంచదగిన అంశం. ఏ దేశం కూడా అటువంటి అంశాలను బహిరంగ పరచదు. ఎందుకంటే వాటిని ఉపయోగించినప్పుడు ఆశ్చర్యకర అంశం ఇమిడి ఉండవలసిందే. ముందుగా తెలిస్తే శత్రు దేశాలు వాటిని ఢీకొట్టగల ఆయుధాలను సమకూర్చుకొనే అవకాశం ఉంటుంది. ఇటువంటి రక్షణ సంబంధ అంశాలలో పరిజ్ఞానం గల కొందరు నిపుణులు ఈ యుద్ధ విమా నాలకు సంబంధించిన ఒకొక్క అంశంపై వివరాలు బహిర్గత పరచమని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే విధంగా కుట్ర పూరితంగా ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానం కలుగుతున్నది.
రాఫెల్ యుద్ధ విమానాలను అమ్ముతున్న ఫ్రాన్స్ అం దుకు సంబంధించి ఈ ఒప్పందంలో వాణజ్యపరమైన అంశాల గురించి బహిరంగ పరచడానికి విముఖత వ్యక్తం చేస్తున్నది. ఇతర దేశాలకు కూడా ఇటువంటి విమానాలను అమ్ముతున్న దృష్ట్యా వాణిజ్య పరమైన వివరాలను బహిరంగ పరచడం ఆ దేశానికి సహజంగానే ఇష్టం ఉండదు. ప్రభుత్వాల మధ్య ఇటువంటి కొనుగోలు ఒప్పందాలు జరిగినప్పుడు వాణిజ్యపరమైన అంశాలను గోప్యంగా ఉంచుతూ ఉండటం అంతర్జాతీయంగా జరిగే సాధారణ ప్రకియ. రక్షణ పరికరాల కొనుగోలు ఇతర వస్తువులకు వలే గరిష్ట అమ్మకపు ధర అంటూ ఏదీ ఉండదని గమనించాలి.
యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ధర కన్నా చాలా ఎక్కువ మొత్తం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వజూపుతున్నదని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఒప్పందం కుదరని, ఖరారు కాని ధరను ఒప్పదం కుదుర్చుకున్న ధరతో ఏ విధంగా పోలుస్తారు ? యూపీఏ హయాంలో జరిగిన సంప్ర దింపులలో ప్రాథమిక అంశాలలో ముందుకు వెళ్ళక పోవడంతో ధరల విషయంలో బేరసారాలకు అవకాశమే లేకుండా పోయింది. పైగా, మొదట్లో జరిగిన సంప్ర దింపులన్నీ విమాన స్వరూపానికి సంబంధించినవి. అందులో అదనంగా కావలసిన సదుపాయాలు, సాయుధ సంపత్తిని గురించిన ప్రస్తావనలు చోటు చేసుకోలేదని గమనించాలి. ప్రస్తుతం కుదుర్చుకున్న ఒప్పందం భారతదేశ సామర్ధ్యానికి అవసరమైన పలు అదనపు సాంకేతిక సముదాయాలను చేర్చి కుదు ర్చుకున్నదని గమనించాలి. మరే యుద్ధ విమానానికీ లేని అదనపు సదుపాయాలను ఇందులో సమకూర్చుకొనే ప్రయత్నం జరిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోని హెచ్‌ఏఎల్‌ను పక్కకు త్రోసివేసి, ప్రైవేట్ రంగంలోని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చుతున్నట్లు కాంగ్రెస్ వారు ప్రధానంగా మరో ఆరోపణ చేస్తున్నారు. కేవలం వాస్తవాలు తెలి యకుండా అమాయకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారా? లేదా ఉద్దేశ పూర్వకంగా బురద చల్లడం కోసం చేస్తున్నారా? అన్నది తెలియవలసి ఉంది. ప్రస్తుతం కుదుర్చుకున్న రాఫెల్ ఒప్పందంలో యుద్ధ విమానాలను భారత దేశంలో తయారు చేయడానికి గాని లేదా విడి భాగాలను ఇక్కడ సమకూర్చు కోవడానికి గాని ఉద్దేశించినది కాదని మనం గమనించాలి. మొత్తం 36 యుద్ధ విమానాలను కూడా ఫ్రాన్స్ లోనే తయారు చేసి, అక్కడే విడి భాగాలను జత చేసి మన దేశానికి పంపించవలసి ఉంటుంది. అందుచేత ఈ మొత్తం ప్రక్రియలో భారత్‌లో తయారు చేయడం కోసం భాగస్వామిని ఏర్పాటు చేసుకొనే ప్రసక్తి ఏర్పడదు. ఆఫ్ సెట్ హామీలను నెరవేర్చడం కోసం దస్సాల్ట్ కంపెనీ భారత దేశంలో అనేకమంది ఆఫ్ సెట్ భాగస్వాములను ఏర్పర్చుకొంది. వారిలో ఒకరు రిలయన్స్ కావడం గమనార్హం. భారీ మొత్తం విలువ గల అంశాలలో ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరగడం, ప్రభుత్వ పరమైన హామీలతో ఖర్చు కూడా తక్కువగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అదనంగా లాజిస్టిక్, శిక్షణ, నష్టపోవడం వంటి అంశాలలో కంపెనీ మద్దతు అందిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ఒప్పందంలో దళారీ గాని, ముడుపులు గాని లేవు. ఇలాంటి ప్రయోజనాలన్నింటికీ రాఫెల్ ఒప్పందం ఎటువంటి మినహాయింపు కాదు. అయితే మన రక్షణ సామర్ధ్యాన్ని అనూహ్యమైన ప్రయత్నాల ద్వారా పెంపొందింపచేసుకొనే ప్రతి ప్రయత్నాన్ని అసహనానికి గురయ్యే కొన్ని శక్తులు- లేనిపోని వివాదాలను సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి.
ఇలాంటి ఒప్పందాలకు సంబంధించి పోటీలో నష్టపోయే శక్తులు ఉద్దేశ పూర్వకంగా వివాదాలను సృష్టించి, ప్రతికూల కథనాలను వ్యాపింప చేసి, కీలక నిర్ణయాలు తీసుకొనే వారిని నిరుత్సాహ పరచి ఒప్పందాలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తుం టాయ. మీడియా కథనాల ప్రకారం అదనంగా రాఫెల్ యుద్ధ విమానాలను, ముఖ్యంగా నావికాదళంలో ఉపయోగించే వాటిని కూడా సమకూర్చు కోవాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఈ విషయంలో ముందుకు వెళ్లకుండా ప్రభుత్వాన్ని అడ్డుకొనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు భావించవలసి వస్తుంది. అటువంటి ప్రయత్నాల ఫలితంగానే ప్రస్తుత వివాదాలు మి న్నంటున్నట్టు కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో భారీగా నిధులను సమకూర్చుకోవడం కోసం కొన్ని పారిశ్రామిక సంస్థలను రాజకీయ నాయకులు లక్ష్యంగా చేసుకొని వ్యవహరిస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా ఆరోపణలు వెలువడుతున్నాయి.
రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం పాల్గొనేటట్లు చేసే ప్రతి చర్యను ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్రతిఘటించే ప్రయత్నం చేస్తుంటాయి. హెచ్‌ఏఎల్ గత అనుభవాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఏరోస్పేస్ ఉత్పత్తిలో ప్రత్యా మ్నాయ సదుపాయాలను ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేయడం కోసం యూపీఏ ప్రభుత్వం ఒక విదేశీ సంస్థతో కలసి ప్రైవేట్ రంగ సంస్థ రవాణా విమానాలను ఉత్పత్తి చేసే ప్రతిపాదనను చేపట్టింది. చివరకు టాటా ఎయిర్ బస్సును ఎంపిక చేసింది. గుత్త్ధాపత్యం గల రక్షణ రంగంలో ప్రైవేట్ పార్టీలు ప్రవేశిస్తే తన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే భయంతో హెచ్‌ఏఎల్ తెలివిగా ఈ ప్రతి పాదనను ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగంల మధ్య పోరాటంగా మార్చింది. అప్పటి నుండి ఇది అధికారుల మధ్య చక్కర్లు కొడుతూ కార్యరూపం దాల్చనే లేదు. ప్రభుత్వ పరిధిలో ప్రైవేట్ రంగాన్ని అనుసంధానం చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రభుత్వ రంగం తిరస్కరిస్తూ వస్తున్నది. అదే తరహాలో కొందరు మీడియా ప్రతినిధులు సైతం హెచ్‌ఏఎల్ స్థానంలో రిలయన్స్‌ను ప్రభుత్వం తీసుకు వచ్చిందంటూ కథనాలను వ్యాప్తి చేస్తున్నారు. ఆరోపణలను సమర్ధించే విధంగా వాస్తవాలు లభిం చినట్లయితే ప్రభుత్వాన్ని విపక్షాలు, మీడియా సంస్థలు విమర్శించడాన్ని పూర్తిగా సమర్ధించవచ్చు. వారి వాదన న్యాయబద్ధం అని చెప్పవచ్చు.
అయితే, దారుణమైన ఆరోపణలను వ్యాపింప చేయడం, వాటిలో ఏదో ఒక ఆరోపణ నిలబడక పోతుందా? అని ఎదురు చూడటం దారుణమని చెప్పవలసిందే. తప్పుడు ఆరోపణలు దేశంలో వాతావరణాన్ని కలుషితం కావించి, భారత రక్షణ వ్యవస్థను ఆధునీకరణ చేసే పక్రియను కుంటు పడే విధంగా చేస్తుంది. ఎంతో ధైర్యం, నిజాయతీ గల నేతలు, అధికారులు కూడా తర్వాత ఇటువంటి వాటిని చేపట్టడానికి వెనుకాడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ధోరణులు జాతి వ్యతిరేక చర్యలుగా దిగజారడం ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని గమనించాలి.
-చలసాని నరేంద్ర
ఆంధ్ర భూమి
http://www.andhrabhoomi.net/content/main-feature-1653