హైదరాబాద్‌లో ప్రముఖ మిఠాయి వ్యాపారస్తుడైన జి.పుల్లారెడ్డి దగ్గరకు ఓసారి కొందరు వ్యక్తులు దేవాలయ నిర్మాణానికి చందా కోసమనివచ్చారట. వచ్చినవారు అరవై మందికి పైగా ఉన్నారట. వెంటనే పుల్లారెడ్డి- ‘నేను చందా ఇస్తాను సరే.. మరి మీ దేవాలయంపై ఎవరైనా దాడికి దిగితే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించడంతో వాళ్ళు కంగుతిని వౌనంగా నిల్చున్నారట. దాంతో ఆగ్రహించిన పుల్లారెడ్డి ‘దేవాలయంపై ఎవరైనా దాడికి పూనుకుంటే ఎదురు తిరుగుతాం అని కూడా మీరు చెప్పడం లేదు. నేను చందా ఇవ్వను’ అన్నారట. నిజమే! మనం ఎన్నో కొత్త దేవాలయాలు కడుతున్నాం. వాటిని నిర్వహించే క్రమంలో ఎవరికివారు గీతలు గీసుకొని ‘భక్త కులాల కుంపటి’ పెట్టుకొని వేరుపడుతున్నాం. మన దేశంలో బౌద్ధ, జైనాల ప్రభావంతో వైదిక ధర్మానికి జరిగిన నష్టాన్ని, నానావిధ పరిమళ పుష్పాల ఆరాధన వల్ల విజభజించబడిన మనస్తత్వాన్ని ఏకత్వ మార్గంలో నడిపించేందుకు ఆదిశంకరులు గొప్ప ప్రయత్నమే చేశారు. ఇటీవల వివిధ దేవతల, గురువుల ఆరాధన చేసేవాళ్లు ప్రత్యేకమైన వర్గంగా మారిపోయి మన మూల సంస్కృతిని విస్మరిస్తున్నారు.
విస్తృతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న గురువుల దగ్గరకు, సంస్థల కార్యక్రమాలకు రాజకీయ నాయకులు పార్టీ భేదం లేకుండా వెళ్లి పాల్గొంటున్నారు. ఆ సంస్థలకు, ఆలయాలకు లేదా తమ అవసరాలకు ఉపయోగించుకొన్న గురువులకు, బాబాలకు ఏదైనా విపత్తు వస్తే మాత్రం ‘సెక్యులరిజం’ వ్రత కంకణం చూపిస్తూ తప్పించుకొంటున్నారు. హిందూ ధర్మానికి మూలస్తంభమైన ఆలయ వ్యవస్థ నాశనం అవుతున్నా పాలకులెవరూ పట్టించుకోవడం లేదు. పుష్కరాలను కూడా ‘ఆధ్యాత్మిక వినోదాత్మక ఈవెంట్’గా మార్చగల రాజకీయ, బ్యూరోక్రసీ వ్యవస్థ ఉన్న దేశం మనది! ‘అది కూడా చేయపోతే ఏం చేస్తాం’ అని సరిపెట్టుకోగల హిందూ జాతి మనది.
విజయవాడలో పుష్కరాల పేరిట దేవాలయాలను కూల్చినా దిక్కులేదు. విఐపీల సేవలో తరిస్తూ వున్న అధికార గణం, తొక్కిసలాటలో పుష్కర భక్తులు ప్రాణాలు పొగొట్టుకున్నా పట్టించుకొన్న పాపాన పోలేదు. ఇక ఏ పుణ్యక్షేత్రంలో చూసినా భక్తులకు తీవ్ర ప్రయాస తప్ప ఇంకేం లేదు. అధికారంలో వున్నవాళ్ల బంధుగణానికి సేవ చేయడంలో మునిగిపోయే అధికార గణం భక్తుల సౌకర్యాల విషయంలో అంత సీరియస్‌గా లేదన్నది నిజం. ఆలయాలకు ఆదాయం బాగానే ఉన్నా అరకొర వసతులతో ఆ అయిదు గంటలు అలాగే భక్తులు కాలం గడిపి అన్నీ మర్చిపోతారన్న సూత్రం అధికారులకు, నాయకులకు బాగా తెలుసు. అలనాడు నియంత హిట్లర్ అందరిముందూ ఓ కోడిని తెచ్చి ఈకలు పీకుతుంటే అది విలవిలలాడిపోయిందట. వెంట నే ఆ కోడికి కొన్ని గింజలు వేస్తే అది ఈకలు పీకిన విషయం మరచిపోయి ప రుగులెత్తుకొని పోయి తి న్నదట. అలాగే హిందూ సమాజం దైవ సన్నిధిలోకి వెళ్లాక అప్పటిదాకా పడిన కష్టాలన్నీ దైవ దర్శనం తర్వాత అన్నీ మరచిపోయి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇంత జరుగుతున్నా పేరుమోసిన పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వాములు కిమ్మనకుండా ఉండిపోవడం ఆశ్చర్యం. నేతలతోపాటు స్వాములు కూడా ఇటీవల వీఐపీలుగా మారిపోయారు. ఇక ఇవన్నీ ప్రశ్నించాల్సిన ప్రధాన స్రవంతి మీడియా అధినేతలు, ఆయా సంస్థల వాళ్లు, ఆఖరుకు స్థానిక విలేఖరులు కూడా రాజకీయ నాయకుల్లా బ్రేక్ దర్శనాలు చేసుకుంటున్నారు.
ఈ అవలక్షణాలకు తోడు వివిధ క్షేత్రాల్లో చిరు వ్యాపారస్తులు కొన్ని కొత్త సంప్రదాయాలను సృష్టిస్తున్నారు. నదీతీరాల్లో ఉన్న దేవాలయాల్లో కొబ్బరికాయ, కొన్ని పూలు, ఏవో ఆకులు కలిపి అందంగా అలంకరించి నదుల్లో వదిలేయాలని ఈ షాపులవాళ్లే భక్తులకు బోధిస్తున్నారు. ఆధ్యాత్మిక తత్వ మూలాలు తెలియనివాళ్లు కొన్ని అవసరం లేని పదార్థాలను నీటిలో వదులుతూ నదులను కాలుష్య కాసారాలుగా మార్చేస్తున్నారు. ఉదాహరణకు గాణుగపురం ఓ గొప్ప దత్తక్షేత్రం. అక్కడ సరైన వసతులు లేనందున వేలాదిమంది భక్తులు ఎక్కడంటే అక్కడ రోడ్లపైన, నదీ తీరంలో, నది పక్కన మల మూత్ర విసర్జన చేస్తున్నారు. ఆలయ కమిటీ ఏమీ పట్టించుకోవట్లేదు. భీమ, అమరజ నదులు కాలుష్యంతో నిండిపోయి వైతరణీ నదిని తలపిస్తున్నాయి. తెలంగాణలోని కొండగట్టులో ఆలయ పరిసరాలను భక్తులే అపరిశుభ్రం చేస్తున్నారు. గుడికి ఆదాయం పెంచే ఆలోచన తప్ప రెండవ ధ్యాస లేని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. దేవుని ముందు అందరూ సమానమన్న ప్రాతిపదిక వదిలేసి డబ్బుతో దేవుని కొలిచే మార్గానికి తెరతీస్తున్నారు. ఇదంతా కేవలం ఫలానా దేవాలయం అని మాత్రమే కాదు. అన్ని దేవాలయాల్లో ఇదే పరిస్థితి. ఒక్క తిరుమలలో మాత్రం పరిశుభ్రతకు గొప్ప ప్రాధాన్యం ఉంది. కానీ అక్కడ అన్య మతస్థులు ఉద్యోగులుగా అధికారం చలాయిస్తున్నారు. అపుడపుడు మత మార్పిడి ముఠాలు అధికారులకు పట్టుబడినా పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అందువల్ల ఇవి పునరావృతం అవుతూనే వున్నాయి.
దేవాలయాల పోషణకు హుండీలు, టిక్కెట్లు ఉండొచ్చని వాదించే వాళ్లూ ఉన్నారు. కానీ ఆ ఆదాయం దైవదర్శనం కోసం వచ్చే భక్తులకు, దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలి. ఈవిషయంపై కులా ల వారీగా విభజించబడిన మనం సామూహిక శక్తి కేంద్రాలైన దేవాలయాల సమస్యలపై స్పందించడం మానేశాం. దైవభక్తి ప్రేరణకు, ధర్మ ప్రచారానికి కేంద్రాలుగా వున్న ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్న వైనంపై తక్షణ చర్యలు అవసరం. ఎన్నో దేవాలయాలకు ఇచ్చిన మాన్యాలు పరాధీనమై, కబ్జా కోరల్లో కకావికలమవుతున్నా ప్రభుత్వాలకు పట్టదు. ఆలయం కేవలం శబ్దబ్రహ్మ ఉపాసనా కేంద్రం మాత్రమే కాదు; సామాజిక విజ్ఞాన శోధనా కేంద్రాలుగా మార్చాలన్న ఆలోచన లేదు. ఆలయాలు ఉద్యోగులను బతికించే ఉపాధి కేంద్రాలు మాత్రమే కాదు, ధార్మిక వ్యాప్తికి మూలసూత్రాలు. వీటిపై అవగాహన లేనివారు, భక్తిలేని వారు అధికారులుగా ఉండడంవల్ల ఈ విధమైన పరిశోధన, కొత్త ఆలోచనలకు స్థానం లేకుండా పోయింది. ఆలయ బోర్డుల్లో కులాల వారీగా, వర్గాల వారీగా, పెట్టుబడిదారులను చేర్చి ఆలయ వ్యవస్థను వాళ్ల స్వంత ఎస్టేటులుగా మార్చేస్తున్నారు. భక్తులకు అరకొర సౌకర్యాలపై, తమకు పూర్తి స్థాయి మర్యాదలపై మాత్రమే చర్చలు, నిర్ణయాలు చేసే ఇలాంటి ధార్మిక మండళ్లు హిందూ ధర్మవ్యాప్తికి శాపాలు.
దేవాలయాల నిర్వహణ విషయంలో నాయకులవి, అధికారులవి ఎన్ని తప్పులున్నాయో పేరుమోసిన స్వామీజీల నిర్లిప్తత కూడా అంతే తప్పు. హిందూ దేవాలయ వ్యవస్థను ముస్లిం పాలకులు ప్రత్యక్షంగా ధ్వంసం చేస్తే ఆంగ్లేయ పాలకులు ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ‘రిలిజియన్ ఎండోమెంట్ యాక్ట్-1863’ను తెచ్చారు. దాని కొనసాగింపుగా ‘ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మాదాయ దేవాదాయ సంస్థల చట్టం-1966’ అమలులోకి వచ్చాక మొదట కొంత నిబద్ధతతో ప్రభుత్వ పెద్దలు ఆలోచించారు. కానీ ఆ తర్వాత వచ్చిన నాయకులు స్వాములకు, పీఠాధిపతులకు ఓ పాద నమస్కారం పడేసి తమకు అనుకూలంగా నిబంధనలను మార్చుతూ వ్యవస్థను ధ్వంసం చేస్తూ వచ్చారు. ఎవరైనా ఎదురుతిరిగితే ప్రభుత్వాధినేతలు వారిని అపఖ్యాతిపాలు చేశారు.
తిరుమలలో వేయికాళ్ల మండపం నిర్మాణం విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రిదండి చినజీయర్ స్వామికి ఎన్ని విభేదాలు వచ్చాయో మనకు తెలుసు. దేవాలయ పాలక మండళ్లలో పైనుండి కింది దాకా రాజకీయ నిరుద్యోగులను నియమిస్తూ థార్మిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. కొన్ని ప్రయివేట్ సంస్థల అధ్యయనం ప్రకారం అనంతపురం జిల్లా కస్సాపురం ఆంజనేయస్వామి దేవాలయ భూమి 444 ఎకరాలు వుంటే అందులో 157 ఎకరాల భూమిని 1957లో అమ్మేసారు. భద్రాద్రి ఆలయానికి చెందిన పురుషోత్తమపట్నం సర్వే నెం.15లోని 917 ఎకరాల భూమిలో 12 ఎకరాలు సిస్టర్ మొగిలి మరియమ్మకు ఎకరాకు 1,25,000 చొప్పున 1998లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం అమ్మగా అక్కడ క్రైస్తవ ప్రార్థనా మందిరాలు వెలిశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, అనంతపురం మొత్తం ఏడు జిల్లాల్లో ఆలయ భూములు 1,12,806 ఎకరాలు ఉంటే ఇందులో ప్రభుత్వం 8 వేల ఎకరాలకుపైగా కారుచౌకగా అమ్ముకొంది. కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో 210 ఎకరాలు చౌకగా ప్రభుత్వం అమ్ముకొన్నా ఆనాడు అడిగే నాథుడు లేడు. ఈ కబ్జాకోరులే ఇపుడు విఐపీలుగా చెలామణి అవుతున్నారు. వాళ్లందరి దర్శనాల కోసం సామాన్య భక్తులను శ్రీశైలం, తిరుపతి దేవస్థానాల్లో సైతం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో తిరుపతిలో ఏకంగా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం మొదలైనా, వకుళమాత ఆలయం చుట్టూ విధ్వంసం జరిగినా పట్టించుకోలేదు. యాదాద్రి, వేములవాడ వంటి దేవాలయాలను ఆధునీకరించి ఓ కొత్త చరిత్ర సృష్టించాలనుకొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా అవి పూర్తయితే చరిత్రలో మిగిలిపోతారు. తెలంగాణ ఆలయ భూములను కబ్జా కోరల నుండి విడిపించి పరిశుభ్రత విషయంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెడితే ఆయన చేపట్టిన ‘ఆపరేషన్ టెంపుల్’ విజయవంతవౌతుంది. ఆంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ, ఇతర పార్టీలన్న తరతమ భేదం లేకుండా కబ్జా చేసిన దేవాలయ భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించాలి.
ఆలయాలను ఆదాయం తెచ్చే మద్యం షాపుల వేలంలా కాకుండా, పిక్నిక్ స్పాట్‌ల్లా కాకుండా ధార్మిక స్థలాలుగానే భావించాలి. నిజాయితీ, నిబద్ధతగల వ్యక్తులను దేవదాయ శాఖలో ఉంచాలి. అపుడే ప్రతి ఆలయం ధార్మిక కేంద్రంగా పరిఢవిల్లుతుంది. ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే 30/87 లాంటి చట్టాలను సవరణ చేసుకోకపోతే గుడులు, గోపురాలు కునారిల్లడం ఖాయం. భక్తులు కూడా తాము సందర్శకులం మాత్రమే అని భావిస్తే ఇదంతా ఇతరశక్తుల చేతుల్లోకి పోతుంది. అదికాకుండా ‘ఏ రోజు కారోజు రైల్వే ప్రయాణికుల్లా’ దేవాలయాలను సందర్శిస్తే మనది అనుకున్న అస్తిత్వం మంటగలవడం ఖాయం. అతి పెద్ద ధార్మిక మతం గల దేశంగా ఉన్నాగానీ కులతత్వం, స్వాభిమానం, పార్టీ విధేయత ఊబిలో కూరుకుపోతున్న మనం దేవాలయాలను రక్షించుకోకపోతే మరో చారిత్రక తప్పిదం చేసినవాళ్లం అవుతాం.
డా॥ పి. భాస్కర యోగి
bhaskarayogi.p@gmail.com
(ఆంధ్రభూమి సౌజన్యం తో)