News

చిత్తూరులో ఆవుల దొంగలు – కొట్టంలో తుపాకీ లభ్యం – ఆందోళనలో జనం

369views

చిత్తూరు జిల్లాలో ఆవులు, ఎద్దులను దొంగిలిస్తున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జిల్లాలోని గంగవరంలో ఆవులు, ఎద్దులను దొంగిలించారు కొందరు దుండగులు. గాంధీనగర్‌లో 5 ఆవులు, 2 ఎద్దులను దొంగల ముఠా అపహరించుకెళ్లింది. అయితే, ఘటన జరిగిన పశువుల కొట్టంలో కంట్రీ మేడ్ రివాల్వర్ లభ్యమవడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. దుండగులు ఒకవేళ తాము దొరికితే కంట్రీమేడ్ రివాల్వర్‌తో జనాలను భయపెట్టి తప్పించుకోవచ్చునని భావించినట్లు తెలుస్తోంది. ఈ రివాల్వర్‌ను గమనించిన పోలీసులు.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాయే ఈ దోపిడీలకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

కాగా, గతంలో తమిళనాడులోని వేలూరు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి చోరీలు జరిగివుండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో అడ్డు వచ్చిన వారిపై దాడులుకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు. అలా తుపాకులను వెంటబెట్టుకుని గోవుల దొంగతనాలకు పాల్పడటం.. అడ్డుపడితే దాడులకు తెగబడటం చేస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ కిరాతక దొంగల ముఠా పట్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వారికి సంబంధించిన రివాల్వర్ లభ్యమవడంతో.. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆవుల చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.