ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త శ్రీ గొట్టిపాటి మురళీమోహన్ ఈ మధ్యాహ్నం స్వర్గస్తులయ్యారు. శ్రీ మురళీ మోహన్ కృష్ణాజిల్లాలోని ఒక ప్రముఖ కుటుంబానికి చెందినవారు. వారి తండ్రి వెంకటేశ్వరరావు చౌదరి కూడా న్యాయవాదిగా సుప్రసిద్ధులు.
మురళీ మోహన్ గారి హైస్కూల్ దశలో వారికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరిచయమైంది. స్వర్గీయ భోగాది దుర్గాప్రసాద్ విజయవాడ విభాగ్ ప్రచారక్ గా పనిచేస్తున్న కాలంలో శ్రీ మురళీ మోహన్ సంఘ కార్యంలో ఉత్సాహంగా నిమగ్నమయ్యారు.
1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమ సమయంలోనూ,1975 ఎమర్జెన్సీ సమయంలో వారు కొద్దికాలం జైలులో కూడా గడిపారు. 1975 లో వారి తండ్రిగారైన వెంకటేశ్వరరావు చౌదరి తనకు కాంగ్రెస్ నాయకులతో ఉన్న పరిచయము, పలుకుబడి సాయంతో శ్రీ మురళీ మోహన్ ని జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో జైలు అధికారులు శ్రీ మురళీ మోహన్ ను ఆర్ఎస్ఎస్ తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొంటూ ఒక లేఖ వ్రాసి ఇమ్మని కోరారు. ఆ ప్రతిపాదనను శ్రీ మురళీ మోహన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. హెబియస్ కార్పస్ పిటీషన్లు దాఖలుచేసి , తన కేసు తానే వాదించుకొని విడుదల పొందారు. అనంతరం 1977 ఎన్నికలలో ఆయన విజయవాడ పార్లమెంటుకు జనతా పార్టీ తరపున పోటీ చేశారు.
1970 తొలి సంవత్సరాలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ విజయవాడ నగర కార్యవాహగా బాధ్యత స్వీకరించారు.1979నుండి కృష్ణా జిల్లా సంఘచాలక్ గా,1981నుండి 1987వరకూ కృష్ణా, గుంటూరు, ప.గో. జిల్లాలతో కూడిన విజయవాడ విభాగ్ సంఘచాలక్ గా బాధ్యత వహించారు. ఆతర్వాత కూడా కృష్ణా , గుంటూరు జిల్లాలతో కూడిన విజయవాడ విభాగ్ సంఘచాలక్ గా కొనసాగి ఆపై 1991-93సంలలో పూర్వాంధ్ర ప్రాంత కార్యవాహగా బాధ్యత వహించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలకులుగా విజయవాడ విచ్చేసిన సందర్భాలలో పూజనీయ శ్రీ గురూజీ, బాళాసాహెబ్ దేవరస్ ల వంటి పెద్దలకు ఆతిథ్యమిచ్చిన భాగ్యం స్వర్గీయ మురళీ మోహన్ కు లభించింది.
వారు ఎనికేపాడులో ఉన్న శ్రీవిజ్ఞాన విహార (సి.బి.ఎస్.ఈ సిలబస్ తో నడిచే) పాఠశాలకు తమ కుటుంబం తరఫున స్థలదానం చేయించారు . మాంటిస్సొరీ కళాశాల, సత్యనారాయణ పురం లోని శిశు విద్యామందిరం, విజ్ఞాన విహార పాఠశాలల నిర్వహణలో చురుకైన పాత్ర వహించారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ (యూనివర్సిటీ) సెనేట్ సభ్యులుగా పట్టభద్రుల తరఫున ఎన్నికైనారు. బెజవాడ బార్ అసోసియేషన్ కార్యదర్శిగా చాలా సంవత్సరాలు బాధ్యత వహించారు. జాగృతి వారపత్రికను, సాహిత్యనికేతన్ పుస్తక విక్రయశాలనూ నిర్వహించే జాగృతి ప్రకాశన్ ట్రస్టులో దశాబ్దాలపాటు ట్రస్టీగా వ్యవహరించారు.
1977లో దివిసీమలో ఉప్పెన సంభవించగా , ఆతర్వాత జరిగిన సేవాకార్యక్రమాలలో, 1986లో గోదావరినదికి వఱదలు వచ్చిన తర్వాత ప.గో జిల్లాలో జరిగిన వఱద బాధితుల సహాయ కార్య క్రమాలలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1980లో నాగాయలంకలో ఏర్పరచిన దీనదయాళ్ హాస్పిటల్ స్వంత భవన వసతి ఏర్పరచటంలో అనేక గ్రామాలకు స్వయంగావెళ్లి విరాళాలు సేకరించి ఇచ్చారు. యాబై సంవత్సరాలకు పైబడిన వారి సమాజసేవారంగ కార్యకలాపాలలో మచ్చుకు వీటిని పేర్కొనటం జరుగుతున్నది.
వారి అర్థాంగి శ్రీమతి స్వతంత్రభారతి వైద్యారోగ్య శాఖలో ఉన్నత పదవులలో పని చేశారు. వారికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. వారి పెద్ద కుమార్తె గత నెలలో గుండెపోటుతో మరణించారు. ముగ్గురు కుమార్తెలూ విదేశాలలో ఉన్నారు. వారి కుమారుడు కేశవ్ మురళీమోహన్ దంపతుల వద్దనే ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఉండినారు.
ఆజన్మాంతము సంఘ కార్య విస్తరణకై తమ సంపూర్ణ శక్తిని వెచ్చించిన స్వర్గీయ మురళీమోహన్ ఆదర్శప్రాయుడు.
ఉపరాష్ట్రపతి విచారం
ప్రముఖ న్యాయవాది, ఆర్ ఎస్ ఎస్ ప్రముఖుడు శ్రీ గొట్టిపాటి మురళీమోహన్ మరణం పట్ల భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఓ ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తనకు ఎంతో సన్నిహితుడని ప్రధానంగా చాలా సౌమ్యులు…. స్నేహశీలి అని అన్నారు. న్యాయవాద వృత్తి పట్ల వారికి గల నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో కూడిన జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జైలుకు వెళ్లారని అన్నారు. యువతలో ఈ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తు చేస్తూ నిరంతరం వారిలో స్ఫూర్తి నింపే వారని అన్నారు. శ్రీ మురళీ మోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు శ్రీ నాయుడు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.