
సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైన్యం శత్రువులతోనే కాకుండా అక్కడ ఉండే వాతావరణంతో కూడా పోరాడాల్సి ఉంటుంది. గడ్డకట్టే చలిలోనూ విధులు నిర్వర్థిస్తుంటారు. భారత్, చైనా మధ్య యుద్ధ వాతావరణానికి కేంద్ర బిందువుగా మారిన ప్రాంతం గల్వాన్ లోయ సహా అనేక ప్రాంతాల్లో శీతాకాలంలో మైనస్ 40 డిగ్రీల వరకు ఉష్రోగ్రతలు పడిపోతాయి. అలాంటి శీతల ప్రాంతాల్లో గస్తీ కాసే మన సైనికుల కోసం ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ సోలార్ టెంట్లను తయారుచేశారు. ఆయన గతంలో కూడా విభిన్నమైన ఆవిష్కరణలు చేసి పేటెంట్లను కూడా పొందారు. గల్వాన్ లోయలో సేవలందిస్తున్న భారత సైనికుల కోసం తాజాగా ఈ గుడారాలను రూపొందించారు.
ఈ సోలార్ టెంట్ పగటి వేళల్లో సౌర శక్తిని గ్రహించి రాత్రి వేళల్లో ఆ చోటును వెచ్చగా ఉంచుతుంది. హిమాలయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివిస్ట్ లాడ్డాఖ్ కు చెందిన బృందంతో కలిసి ఈ సోలార్ టెంట్ ను తయారుచేసినట్లు సోనమ్ వాంగ్ చుక్ పేర్కొన్నారు. బయట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉన్నా ఈ టెంట్లలో మాత్రం 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఒక్కో టెంట్‌లో 10 మంది సైనికులు ఉండొచ్చు. ఆ టెంట్ బరువు 30 కిలోల కన్నా తక్కువ ఉండటంతో దాన్ని మడతబెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. సియాచిన్, బ్లాక్ టాప్ హిల్ వంటి చల్లని ప్రదేశాల్లోని సైనికులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. సూపర్ లైట్ అల్యూమినియమ్ మెటీరియల్ ను ఉపయోగిస్తే టెంట్ బరువును మరో 10 కేజీలు తగ్గించవచ్చని వాంగ్ చుక్ పేర్కొన్నారు. ఈ శీతాకాలంలో ఎత్తయిన, చల్లని ప్రాంతంలో ఈ టెంటును పరీక్షిస్తామని ఆయన వెల్లడించారు.





