News

రాముడొచ్చాడు….

59views

జై శ్రీరామ్‌.. జైజై శ్రీరామ్‌ అనే నినాదాలతో రామతీర్థం మార్మోగింది. తితిదే ఆధ్వర్యంలో కృష్ణ శిలతో తయారు చేసిన సీతారామ, లక్ష్మణుల విగ్రహాలను ప్రత్యేక వాహనంలో శనివారం మధ్యాహ్నం తీసుకొచ్చారు. కుమిలి రహదారి నుంచి పోలీసు బందోబస్తు నడుమ రామతీర్థం ఉన్నత పాఠశాల కూడలికి చేరుకున్న విగ్రహాలకు దేవాదాయ శాఖ ఆర్జేసీ భ్రమరాంబ పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాలతో దేవస్థానం ముఖద్వారం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. దేవస్థానంలో ధ్వజస్తంభం వద్ద విగ్రహాలను పీఠంపై నిలిపి శాస్త్రోక్తంగా అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, పోలీసుల సహకారంతో విగ్రహాలను, పీఠాన్ని యాగశాల ఎదురుగా ఉన్న గదిలోకి తరలించి భద్రపరిచారు. ఆర్జేసీ భ్రమరాంబ మాట్లాడుతూ ప్రధాన దేవాలయంలో సీతారామలక్ష్మణుల నూతన విగ్రహాలకు ఈ నెల 25 నుంచి అంకురార్పణ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 26, 27 తేదీల్లో యాగశాలలో ప్రాయశ్చిత్త హోమాలు జరుగుతాయన్నారు. 28న కల్యాణ మండపం వద్ద బాలాలయం ఏర్పాటు చేసి అందులో విగ్రహాలను ప్రతిష్ఠించి, నిత్యపూజలు నిర్వహిస్తారని చెప్పారు. నీలాచలం కొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్మాణం పూర్తయ్యాక, అక్కడికి విగ్రహాలను తరలించి ప్రతిష్ఠాపన నిర్వహించనున్నట్లు వివరించారు. డిప్యూటీ కమిషనరు ఎన్‌.సుజాత, రామతీర్థం, పైడితల్లి ఆలయాల ఈవోలు రంగారావు, సుబ్రహ్మణ్యం, ప్రధానార్చకులు సాయిరామాచార్యులు, స్థానాచార్యులు నరసింహాచార్యులు, కిరణ్ ‌కుమార్‌, పవన్ ‌కుమార్ తదితరులు ‌పాల్గొన్నారు. విజయనగరం గ్రామీణ సీఐ టి.సత్యమంగవేణి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.