News

భారత్ లో కోవిడ్ టీకా శుభవార్తతో కొత్త ఏడాది మొదలయ్యే సూచనలు

494views

రోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించే టీకా శుభవార్తతో కొత్త ఏడాదిని మొదలుపెట్టే సూచనలు కన్పిస్తున్నాయి. అతి త్వరలో దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతులు లభించే అవకాశాలున్నట్లు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ డాక్టర్‌ వీజీ సోమని సూచనప్రాయంగా తెలిపారు.

‘బహుశా.. చేతిలో ఏదో ఒక టీకాతో భారత్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటుందేమో.. ప్రస్తుతానికి నేను చెప్పగలిగేది ఇంతే’ అని సోమని అన్నారు. ఓ వెబినార్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. టీకా అత్యవసర వినియోగానికి అనుమతులపై నిపుణుల కమిటీ రేపు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో సోమని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రేపటి సమావేశంలోనే టీకాకు అనుమతులు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ సంస్థలు తమ టీకాల అత్యవసర వినియోగం కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించడానికి నిపుణుల కమిటీ బుధవారం సమావేశమైంది. మరింత లోతుగా చర్చించేందుకు శుక్రవారం మరోసారి భేటీ కానుంది. ఈలోగా టీకాలపై మరింత సమాచారం ఇవ్వాలని సంస్థలను కోరింది. ఇదిలా ఉండగా.. కొత్త ఏడాదిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రధాని మోదీ కూడా తెలిపారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ సన్నాహాలు చివరి దశలో ఉన్నాయన్న ప్రధాని.. స్వదేశీ టీకాలనే ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపటి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.