ArticlesNews

ఆదర్శనీయ కార్యకర్త శ్రీ బాలిశెట్టి బాలసుబ్రహ్మణ్యం అస్తమయం

983views

ర్నూలు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కి స్తంభ సమానుడిగా నిలిచిన కార్యకర్త శ్రీ బాలిశెట్టి బాలసుబ్రహ్మణ్యం కర్నూలులో తుది శ్వాస విడిచి అనంతలోకాలకు పయనమయ్యారు.

కీర్తి శేషులు శ్రీ బాలిశెట్టి బాలసుబ్రహ్మణ్యం చిన్నవయస్సు నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త.  నంద్యాల పట్టణంలో ఉన్నప్పుడు దాదాపుగా 10 సంవత్సరములు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. వివాహానంతరం బేతంచెర్ల మండలంలో విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాలను గ్రామగ్రామానికి విస్తరించే బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారు కర్నూలు పట్టణంలో స్థిరపడ్డారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగానూ,  కర్నూలు జిల్లాలో గణేష్ ఉత్సవ సమితి కార్యక్రమాల నిర్వాహకుడిగానూ ఆయన విజయవంతంగా తన బాధ్యతలు నిర్వర్తించారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం 6/ 10 /2020  మంగళవారం నాడు స్వర్గస్తులైనారు.

వారు విభాగ్ ధర్మ జాగరణ ప్రముఖ్ గానూ మరియు కర్నూలు, అనంతపూర్ రెండు విభాగ్ లకు విశ్వహిందూ పరిషత్ కార్యదర్శిగానూ పని చేశారు. ప్రస్తుతం శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు విశ్వహిందూ పరిషత్ దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ధర్మ ప్రసారప్రముఖ్ గా పని చేస్తున్నారు.

వీరి కుటుంబ సభ్యులందరూ స్వయంసేవకులు. చాలామంది ప్రచారకులుగా, విస్తారకులుగా చేసినవారే… అందరికీ సుపరిచితులైన శ్రీ బి వి నాగేంద్ర ప్రసాద్ గారు వీరి కుటుంబం నుండి వచ్చిన ప్రచారక్. వీరి కుటుంబంలో అక్కయ్యలు తల్లులు అందరినీ కలుపుకొంటే, వారిలో ఎక్కువమంది బాధ్యతలలో ఉన్నవారు, మరియు క్రియాశీల కార్యకర్తలే కనిపిస్తారు.

“నా కుటుంబ అవసరాలకు సరిపోయేంత ధనం సంపాదిస్తే చాలు, మిగతా సమయంమంతా సంఘం కోసమే అంటూ చెప్పేవాడు… చెప్పడమే కాదు జీవితాంతం , అలాగే గడిపినవాడు.

తాను కష్టపడుతూ..,తన ఇద్దరు కొడుకుల్ని ఉన్నత చదువులు చదివించుకున్నారు. వారిని కూడా స్వయంసేవకులుగా తీర్చిదిద్దారు.

రాయలసీమ ప్రజా జీవితం, వారి అలవాట్లు, వ్యవహారశైలి అన్నీ తెలిసిన వారైనందున అనంతపూర్ కడప కర్నూలు జిల్లాల్లోని కార్యకర్తలందరితో మంచి సంబంధం కలిగి ఉండేవారు. కేవలం కర్నూలు జిల్లాలోనే నాగేంద్ర ప్రసాద్ గారికి కుడి భుజంగా ఉంటూ సుమారు 500 గ్రామాలకు మన కార్యక్రమాలను విస్తరింపజేశారు. సంఘ, హిందుత్వ, సామాజిక, సేవా కార్యక్రమాలు చేయడానికి 24 గంటలూ సిద్ధంగా ఉండే వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు.

ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి సహకరించే గుణం కలిగిన వారు. విశ్వహిందూ పరిషత్ కార్యాలయాల నిర్మాణ సమయంలో అయితే నేమి, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీరాఘవరెడ్డి గారి పర్యటనలో, ఆదోని కార్యాలయం ఆరంభ కార్యక్రమము సందర్భంగా ఏర్పాటు చేసిన సభ, ఇంకా అనేకంగా జరిగిన సమావేశాల సమయంలో అయితేనేమి, వారి యొక్క క్రియాశీలత ఒక్కోసారి సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుండేది.

2009వ సంవత్సరం కర్నూలు నగరాన్ని వరద నీరు ముంచెత్తినప్పుడు వెంటనే స్పందించి సేవా కార్యక్రమాలను నిర్వహించి ఆ సమయంలో అగ్రభాగంలో నిలుచున్న శ్రీ బాలసుబ్ర్హమణ్యం గారి సేవా భావన ఎప్పుడూ గుర్తుకు వస్తూ ఉంటుంది.

బాల సుబ్రహ్మణ్యం గారిని, వారి ప్రశ్నించే తత్వాన్ని చూసి స్వయం సేవకులు ముద్దుగా “రెబల్” అని పిలుచుకునేవారు. యువకులతో యువకుడిగా, చిన్న పిల్లలతో పిల్లవాడిగా, గృహస్తులతో అనుభవం ఉన్న వ్యక్తిగా అందరితో కలిసి ఉత్సాహంతో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవారు. బాల సుబ్రహ్మణ్యం గారు ఉన్నారంటే ఆ ప్రదేశం కోలాహలంగా ఉండేది.

ఏడు సంవత్సరాల క్రితం ప్రయాగ త్రివేణి సంగమ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించింది ఆ కార్యక్రమంలో 55 మంది పూజ్యస్వామీజీలు కూడా మన ప్రాంతం నుండి పాల్గొన్నారు. ఆ సమయంలో హిందీ భాష అంతగారాని కార్యకర్తలతో కలిసి త్రివేణి సంగమం స్నానానికి వెళ్ళే క్రమంలో కొద్దిసేపు జన సందోహంలో కార్యకర్తలందరూ విడిపోయారు. తిరిగి కొన్ని నిమిషాల్లోనే అందరూ కలుసుకున్నారు. కానీ ఆ సమయంలో బాల సుబ్రహ్మణ్యం గారు కార్యకర్తల కోసం పడిన గూర్చి అప్పుడు వారితో ఉండిన కార్యకర్త ఒకరు ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.

2013 లో ఆదోనిలో గణేష్ ఉత్సవాల సందర్భంగా జరిగిన గలాటా కారణంగా ఆ మరుసటి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించ కూడదని పోలీసులు ఆంక్షలు విధిస్తే, కార్యకర్తలపై నిర్బంధం ప్రకటిస్తే…. బాలసుబ్రహ్మణ్యం గారు తిరగబడి, పోలీసులతో పోరాడి అనుమతులు సాధించారు. ఆరోజు వారిలోని ఆవేశం చూసిన కార్యకర్తలు ఆ సంఘటనను ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు.

సుబ్రహ్మణ్యం గారి శ్రీమతి గారు కూడా ఎప్పుడూ వారి పర్యటనలకు ప్రోత్సాహము, ఉత్సాహము ఇవ్వడమే తప్ప అభ్యంతరం చెప్పిన సంఘటనలు బహుశా లేనే లేవేమో…, ఏదేమైనా శ్రీ బాలసుబ్రహ్మణ్యం లాంటి అంకితభావం కలిగిన, అనుభవజ్ఞుడైన కార్యకర్త మన నుంచి దూరం కావడం అత్యంత విచారకరమని సంఘ పరివార్ కార్యకర్తలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.