News

భారత సైనికులను ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదు – రక్షణమంత్రి రాజ్ నాథ్

362views

భారతదేశ సరిహద్దులోని లద్దాఖ్‌ ప్రాంతంలో పెట్రోలింగ్‌ విషయంలో భారత సైన్యాన్ని ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి రాజ్యసభలో చేసిన ప్రకటనపై పలువురు ఎంపీల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా లద్దాఖ్‌ సరిహద్దు ప్రాంతంలో గస్తీ అంశంపైనే చైనాతో వివాదం నెలకొంది. పెట్రోలింగ్‌ నుంచి ప్రపంచంలో ఏ శక్తీ భారత సైనికులను అడ్డుకోలేదని స్పష్టంచేశారు. ఇందులో భాగంగా మన దేశ సైనికులెందరో తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఉల్లంఘనలకు పాల్పడుతూ డ్రాగన్‌ కవ్విస్తోందని మండిపడ్డారు.

చైనా రెచ్చగొట్టే ధోరణితో ఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అలాగే, చైనా చెప్పిందానికి చేసేదానికి పొంతన ఉండట్లేదని తన ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దు వివాదంపై భారత్‌ సామరస్య పరిష్కారం కోరుకుంటోందని, అలాగని దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు ఎటువంటి చర్యలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇరువైపులా దౌత్యపరమైన, సైనికపరమైన చర్చలు ఓ వైపు కొనసాగుతుండగానే, ఆగస్టు 29-30 అర్ధరాత్రి చైనా సైన్యం చొరబడేందుకు ప్రయత్నించిందన్నారు. చైనా దుష్టపన్నాగాలను మన సైన్యం విజయవంతంగా తిప్పికొట్టిందన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.