
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పశ్చిమ యూపీలోని భాగ్‌పాట్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు హత్యకు గురయ్యారు. భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన సంజయ్ ఖోఖర్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి హతమార్చారు. తన సొంత పొలంలో ఉదయం నడకకు వెళ్లిన సంజయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో ఉన్న మృతదేహన్ని పరిశీలించారు. ఈ ఘటనకు వ్యక్తిగత తగాదాలే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వరుస హత్యల నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దర్యాప్తుకు ఆదేశించిన ముఖ్యమంత్రి..
పార్టీ జిల్లా స్థాయినేత హత్యకు గురికావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. 24గంటల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘటనను పోలీస్‌శాఖ తీవ్రంగా పరిగణించింది. శాంతిభద్రతలపై నిర్లక్ష్యం వహించారంటూ స్థానిక ఛప్రౌలీ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ ప్రకటించారు.