ArticlesNews

మన ఇల్లు సమరసతకు కేంద్రం కావాలి

163views

“అన్ని కులాల ప్రజల పట్ల సమ భావంతో వ్యవహరించడమే సమరసత అంటే.” మన ఇంటికి ఎవరో వచ్చారు అనుకోండి. మన ఇంట్లోని ముందు గదిలో కూర్చోపెట్టి మాట్లాడతామా? కొందరిని అయితే కుర్చీలో కూర్చో పెడతతాం, కొందరిని నేలపై కూర్చో పెడతాం, కొందరు అయితే నిలబడే మాట్లాడాలి అనే స్థితి కులం ఆధారంగా ఉందనుకోండి ఇది సరి కాదు. పట్టణాలలో కాదు గ్రామాలలో ఉండే వారి ఇంట్లో స్థితి ఏమిటి? మనం ఆలోచించుకోవాలి. తేడాలు ఉంటే సరి చూసుకోవాలి. మనం స్వయంసేవకులం మన మనస్సులో కులానికి చోటు సహజంగా ఉండదు.

సంఘ కార్యక్రమాలలో కులం ప్రక్కన పెట్టి అందరు స్వయంసేవకులతో సమ భావంతో వ్యవహరించడం సంఘం మనకు నేర్పిన సంస్కారం. ఈ సంస్కారం సంఘ జీవితంలోనే కాక స్వయంసేవకుల కుటుంబాలలో, మిగిలిన వృత్తి జీవితంలో కూడా ఆచరింపబడాలని సంఘం కోరుకుంటోంది.

మన ఇంటికి ఒక స్వయంసేవకో కార్యకర్తో వస్తే కులం గురించి ఆలోచించకుండా ఎలా సమ భావంతో, గౌరవ భావంతో వ్యవహరిస్తామో అలాగే స్వయంసేవకులు కాని ఇతర ఏ హిందువుతోనైనా వ్యవహ రించగలగాలి. ఇంట్లో భోజనం పెట్టే సమయంలో కూడా కొందరికి అయితే ఆకులు, కొందరికి అయితే కంచాలు. కొందరికి అయితే ఆకు వారే ఎత్తు కోవాలి. ఇది సరి కాదు.

ఒకసారి చరిత్రలోకి వెడదాం…..

వేయి సంవత్సరాల క్రితం తమిళనాడులో రామానుజులు జన్మించారు. వారు బ్రాహ్మణ కులంలో జన్మించినా  సమ భావం వారికి జన్మతః లభించింది. వారికి గల ఐదుగురు గురువులలో బ్రాహ్మణులూ, బ్రాహ్మణేతరలూ ఉన్నారు. రామానుజులు లేని సమయంలో ఒక బ్రాహ్మణేతర గురువు వారి ఇంటికి వచ్చారు. గురువుకు భోజనం పెట్ట వలసినదిగా భార్యకు కబురు పంపారు. ఆమె గురువుకు భోజనం అయితే పెట్టింది కాని ఆకును వారినే ఎత్తి వేయమంది. ఇది అతిథి మర్యాద కాదు. ఆమెకు కులాల పట్టింపులు ఎక్కు వ.ఇది సరి కాదని భర్యకు చెప్పారు. ఆవిడ మారలేదు. ఈ రకంగా మూడు సార్లు పొరపాటు జరిగింది. చివరకు రామానుజులు భార్యను పుట్టింటికి పంపి సన్యాసం తీసుకున్నారు. సమతా మూర్తి రామానుజ చార్య అయ్యారు. వీరి ప్రేరణతో గుంటూరు జిల్లా పలనాడులో బ్రహ్మన్న చాపకూడు (అన్ని కులాల వారితో సహా పంక్తి భోజనం) వేయి సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేశారు.

5,250 సంవత్సరాల క్రితం మాట ద్వాపర యుగం. అప్పటికే వర్ణాల ఆధిక్య భావం పుట్టుకు వస్తోంది. మహా భారత యుద్ధ నివారణకు శ్రీకృష్ణుడు రాయబారిగా దృతరాష్ట్రుని కొలువుకు వచ్చాడు. చర్చలు జరుగుతున్నాయి.సాయంత్రం అయింది. చర్చలు రెండవ రోజుకు వాయిదా పడ్డాయి. శ్రీ కృష్ణుడు జన్మతః క్షత్రియడు. పెరిగింది యాదవుల ఇంట. భోజనానికి విదురుని ఇంటికి వెళ్ళాడు. వర్ణం దృష్ట్యా విదురుడు శూద్రుడు. ఆనాడే శ్రీకృష్ణుడు వర్ణాంతర భోజనం చేశాడు. మరి శ్రీ కృష్ణుడిని కుల బహిష్కరణ చేద్దామా?

మన ఇంట్లో శుభ కార్యం అవుతోంది. వివిధ కులాల వారు వచ్చారు. కులాల ప్రకారం భోజన పంక్తులను ఏర్పాటు చెడ్డామా? అందరినీ ఒకే పంక్తిలో కూర్చోబెడదామా? మీరే ఆలోచించండి. పై విషయాలు నగరాలలో సులభమే గ్రామాలలో కష్టం. అయినా ఆచరించాలి. హిందువులు అందరూ సోదరులే. ఇది నినాదం మాత్రమే కాదు కుటుంబంలో సమరసత ఆచరణకు ఒక మంత్రం, తంత్రం. నినాదాలలో కాదు, ప్రతి ఒక్కరం మనసా వాచా కర్మణా సమసతను పాటించాలి. మొదట మన ఇల్లే సమరసతకు కేంద్రం కావాలి.

– కె. శ్యామ్ ప్రసాద్, జాతీయ కన్వీనర్, సామాజిక సమరసత

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.