ArticlesNews

తిరుమల దేవస్థానం నియమాలు : హద్దు దాటితే శిక్ష తప్పదు

146views
(తిరుమల దేవాలయ చరిత్ర అత్యంత ప్రాచీనమైనది. తిరుమల దివ్యక్షేత్రం హిందువులందరికి గొప్ప పుణ్యక్షేత్రం. స్వర్గీయ శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 1978 నుండి 1982 వరకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. వేయికాళ్ళమండపం కూల్చివేత, దేవస్థానం నగల భద్రత, స్వామివారి కల్యాణాల నిర్వహణ స్థలం మార్పిడి వివాదం, మరోప్రాకారం వివాదం ఇలాంటి అనేక అంశాల సందర్భంగా వారి నాయకత్వంలోనే వివాదాలు పరిష్కరింపబడ్డాయి. పది సంవత్సారాలపాటు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సలహాదారుడుగా పనిచేశారు. జీవిత చరమాంకంలో హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఛైర్మన్ గా ఉంటూ అనేక ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ భౌతిక శరీరాన్ని వీడారు. వారు వ్రాసిన ‘తిరుమల చరితామృతం’ (ఎమెస్కో ప్రచురణ) అనే తిరుపతి చరిత్ర గ్రంథం నుండి నేడు మనకు కావలసిన కొన్ని ముఖ్యాంశాలు)

తిరుమల దేవాలయ నిర్వహణకు వ్యవస్థలు:

గవత్ రామానుజులు తిరుమలకు రెండుసార్లు వచ్చారు. తిరుమల దేవాలయపు సక్రమ వ్యవస్థకు అవసరమైన అన్ని చర్యలు వేయి సంవత్సరాల క్రితమే వారు ఏర్పరచారు. అవి నాలుగు వ్యవస్థలు :

1 దేవదేయాలు, ధర్మాదాయాలు, ఆర్జిత సేవల విషయంలో, స్వామివారి కైంకర్యం విషయంలో, యాత్రికుల భక్తుల విషయంలో కావలసిన సదుపాయాలు అన్నీ ఏర్పాటుచేసే బాధ్యత ఆలయ అధికారిది, (ఈ అధికారిని ఆనాటి రాజులు నియమించేవారు. ఇదే కాలక్రమంలో దేవస్థానం బోర్డుగా రూపొందింది.)

2 ఆలయ అధికారులు అందించే పదార్థాలు ఆమోదయోగ్యాలా? కావా? కైంకర్యానికి దిట్టం ప్రకారం ఇస్తున్నారా? లేదా? సమయపాలన చేస్తున్నారా? లేదా? చూసే అధికారం ఏకాంగిది / జియ్యంగారిది. ఆలయంలో కైంకర్య సామాగ్రి అంతా జియ్యంగారి ఏకాంగి ద్వారానే అర్చకులకు అందజేయడం జరుగుతుంది. (ఈ జియ్యంగారు ఒక సన్యాసి. కాలక్రమంలో పని ఒత్తిడి దృష్ట్యా పెద జియ్యంగార్, చిన్న జియ్యంగార్ గా ఇద్దరితో రూపొందింది.)

3. ఇలా ఏకాంగి/జియ్యంగారు అందజేసిన సామాగ్రితో ఆరాధన అర్చన చేయడం అర్చకుల బాధ్యత. ఈ అర్చన వైఖానస పద్దతిలో జరుగుతుంది. ఇది వంశపారంపర్య వ్యవస్థ. అర్చకులు తమ పూజా కాలంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. వారి కుటుంబాలవారు తిరుమలలో ఉండరాదు. రెండు నెలలు పనిచేసిన తరువాత అర్చకుడు మరొక అర్చకునికి బాధ్యతలను అప్పజెప్పి తిరుపతిలోని తన కుటుంబం వద్దకు వెళతాడు.

4. పై అన్ని వ్యవస్థలు, ఆచారాలు, సంప్రదాయాలు పరిశీలించి సలహాలు ఇచ్చేవారు పండితులయిన ఆచార్య పురుషులు, ఇది గౌరవ సూచకమైన బాధ్యత.

102వ ఏట శ్రీ రామానుజులు రెండవసారి వచ్చినపుడు అన్ని వ్యవస్థలను చట్టబద్ధం చేస్తూ ఆనాటి పాలకుడైన యాదవరాజుచే ఒక శాసనం చేయించారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు ఈ నాలుగూ. (అయితే రాజకీయ కోణంతో ప్రభుత్వంద్వారా ఏర్పడిన తిరుమల తిరుపతి బోర్డు కొన్ని సందర్భాలలో లక్ష్మణరేఖను దాటి ఇతర వ్యవస్థలపై కూడా ఆధిపత్యం వహిస్తున్నది. ) శ్రీ రామానుజాచార్యులు ఏర్పరచిన వ్యవస్థ గత వేయి సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతోంది

కొన్ని పొరపాట్లు – అవి చేసిన వారికి శిక్షలు

వేయి సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో కొందరు వ్యక్తులు కొన్ని అపచారాలు చేశారు. ఉదాహరణకు 13వ శతాబ్దంలో స్వామివారి గర్భాలయంలో ప్రతిరోజూ 24 చమురు దీపాలు వెలిగించడానికి పాలకులు ఏర్పాటు చేస్తే, అర్చకులు రెండేసి దీపాలు మాత్రమే వెలిగిస్తూ ఉండేవారట. దీనిపై విచారణ జరిగింది. లోపానికి కారకులను గుర్తించారు. తిరుచానూరు సభకు చెందిన శ్రీ వైష్ణవ సభాసదులనుండి పరిహారం సొమ్ము వసూలుచేశారు కూడా.

1843 నుంచి 1933 వరకు 90 సంవత్సరాల పాటు ఆరుగురు మహంతులు దేవాలయాన్ని చక్కగా నిర్వహించారు. మహంతు భగవాన్ దాస్ పై వచ్చిన ఆరోపణలు కోర్టులో నిరూపణై 18నెలలు కారాగార శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇలా పొరపాటు చేసిన వ్యక్తులను ఆనాటి పాలకులు శిక్షించారు. స్వామివారి ఆస్తులను కైంకర్యం చేసిన ఘటనల పర్యవసానం వివరిస్తూ ఆంగ్లేయ అధికారి మెకంజే పేర్కొన్న వివరాలు పరిశీలించి తగ్గవి.

కలియుగం ప్రారంభమైన నాటి నుంచి 1800 సంవత్సరం వరకు ఆలయంలో పూజలు, సేవలు క్రమం తప్పకుండా సక్రమంగా జరుగుతూ వచ్చాయి. కానీ అమలుదార్లు, రెంటర్లు వచ్చిన తరువాత జరిగే నైవేద్యాలలో నాణ్యత తగ్గిపోతూ వచ్చింది. కారణం – అమలుదారులు ఆలయ ఆదాయ నిర్వహణలో చేసిన దేవద్రోహం. వాళ్ళు సొంత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఆలయ నిధులని ఖర్చు పెట్టకుండా కాజేసేవారు. నైవేద్యాల వాస్తవ పరిమాణం తగ్గించి, ఎక్కువగా ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించి మిగిలింది మింగేసేవారు. నవాబుకి, ఈస్టిండియా కంపెనీకి ముడుపులు కట్టాలని యాత్రికులను పీడించే వారు.

వాళ్ళు బాగుపడ్డారా? దేవద్రోహం చేసి దేవుడి సొమ్ము కాజేసిన వాళ్ళు, దేవుడి పేరుమీద దోచుకున్నవాళ్ళూ ఎంతబాగుపడ్డారంటే అలాంటి వాళ్ళ కుటుంబాలు నిర్వంశం (వారసులు పుట్టకుండా) అయిపోయాయి. అలా దోచుకున్నవాళ్ళు ఆ దోచుకున్నదాన్ని అనుభవించే అవకాశం లేకుండా మానసిక అశాంతికి గురై, అకాల మరణం చెందారు. ఇలాంటి అకాల మరణాలు ఏటా 2,3 జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు అనేకమంది నాకు కనిపిస్తున్నారు. ఇందుకు విరుద్దంగా తిరుమల శ్రీనివాసుని భక్తితో కొలిచి నీతి నిజాయితీలతో సేవించిన వాడు సుఖపడతారని అనేకమంది జీవితాలు నిరూపిస్తున్నాయి…..”

గుడి మాన్యాన్ని కాపాడిన సుదర్శన చక్రం:

రాజులు, భక్తులు దేవాలయ నిర్వహణకు అనేక భూములను, గ్రామాలను దానం చేశారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో పెద్దభాగం ఈ భూముల నీటివనరుల అభివృద్ధికే ఖర్చు అయ్యేదని అనేక శాసనాలు తెలియజేస్తున్నాయి. ప్రజలలో దైవభక్తి, పాపభీతి బాగా ఉండటంవల్ల తిరుమల శ్రీనివాసుని భూముల, గ్రామాల సరిహద్దుల్ని సూచిస్తూ సర్వే రాళ్ళన్నింటిమీద ‘సుదర్శన చక్రాన్ని’ చెక్కించేవారు. ప్రజలు ఆ సుదర్శనచక్రాన్ని చూస్తూనే “దేముడి మాన్యం” అనుకుంటూ భక్తితో పక్కకి తప్పుకునేవారు. అలా ‘సుదర్శనచక్రం’ ఆ స్వామివారి దేవదేయాన్ని కాపాడుతూ ఉండేది. (పుట 197)

సంకలనం : K. శ్యాంప్రసాద్, తిరుమల తిరుపతి సంరక్షణ సమితి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.