ArticlesNews

కార్గిల్ విజయం

98views

1998 -1999 ల మధ్య శీతాకాలములో పాకిస్తాన్ సైన్యం కొంత మంది సైనికులను ముజాహిదీన్ ల రూపంలో భారత్ కాశ్మీర్ లోకి పంపింది. ఈ చర్యకి “ఆపరేషన్ బద్ర్” అని గుప్త నామం. దీని లక్ష్యం కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను విడదీసి, భారత సైన్యాన్ని సియాచెన్ నుండి వెనక్కి పంపడం, భారత్ ని కాశ్మీర్ సరిహద్దు పరిష్కారంలో ఇరుకున పెట్టడం. అంతేగాక ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయంగా ముఖ్యాంశం అవ్వాలని పాక్ ఉద్దేశ్యం.

మొదట్లో భారత సైన్యం ఈ చొరబాట్లను పలు కారణాల వల్ల గుర్తించలేదు. గస్తీ కాసే దళాలను చొరబాట్లు జరిగిన ప్రాంతాలకి పంపలేదు. శతఘ్నులతో పాక్ దాడులు చేస్తూ చొరబాటు దారులకు వీలు కల్పించింది. కానీ, మే రెండో వారానికి, సౌరభ్ కాలియా నేతృత్వం లోని భారత గస్తీ దళంపై జరిగిన ఆకస్మిక దాడి వల్ల చొరబాట్లు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 130 – 200 చ.కి.మీ. మేర భారత భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించింది.

ఈ చొరబాటుకు, దురాక్రమణకు భారత ప్రభుత్వం “ఆపరేషన్ విజయ్” తో జవాబిచ్చింది. 200,000 మంది భారత సైనికులను సమర రంగానికి పంపింది. భారత వైమానిక దళం “ఆపరేషన్ సఫేద్ సాగర్” ని ప్రారంభించింది. భారత నావికా దళం కూడా పాకిస్తాన్ కు చెందిన ఓడరేవులకు (ముఖ్యంగా కరాచి ఓడరేవుకి) వెళ్ళే మార్గాలను మూసివేసేందుకు సిద్ధమైంది.

కాశ్మీరు మొత్తం ఎత్తైన కొండ ప్రాంతం. ఇక్కడ NH 1D జాతీయ రహదారి వంటి అత్యుత్తమ రోడ్లు సైతం రెండు లేన్లకే పరిమితమయ్యాయి. ఇటువంటి కష్టతరమైన మార్గం వల్ల ట్రాఫిక్ నిదానంగా సాగింది. అంతేగాక, ఎత్తైన ప్రదేశం కావడంతో విమానాల ద్వారా సామాగ్రిని తరలించడం కూడా కష్టతరమైంది. దీంతో NH 1D రహదారిని కాపాడుకోవడం భారత్ కు అత్యంత ప్రధానం. పాకిస్తాన్ సైన్యానికి వారి స్ధావరాల నుండి NH 1D రహదారి స్పష్టంగా కనిపించడమే కాక శతఘ్నులతో దాడి చేయడం అత్యంత సులువు. ఇది భారత సైన్యానికి పెద్ద సమస్య. ఎందుకంటే అన్నిరకాల సైనిక సామగ్రిని తరలించుకోడానికి  రహదారి చాలా అవసరం. శతఘ్నులతో దాడి వల్ల లేహ్ ప్రాంతం విడిపోయే ప్రమాదం ఏర్పడింది (అయినా హిమాచల్ ప్రదేశ్ ద్వారా మరో దూర మార్గం ఉంది).

చొరబాటుదారుల వద్ద చిన్న ఆయుధాలు, గ్రనేడ్లు మాత్రమే కాక ఫిరంగులు, శతఘ్నులు, యుద్ధవిమానాలని సైతం కూల్చివేసే తుపాకులు ఉన్నాయి. చాలా చోట్ల చొరబాటుదారులు మందు పాతరలు అమర్చారు. 8,000 మందుపాతరలు కనుగొన్నట్లు భారత్ ప్రకటించింది. మానవ రహిత విమానాలు, అమెరికా సమకూర్చిన AN/TPQ-36 ఫైర్ ఫైండర్ రాడార్ ల ద్వారా పాకిస్తాన్ పర్యవేక్షణ కొనసాగించింది. NH 1D కి చేరువలో ఉన్న పర్వత శిఖరాలను స్వాధీన పర్చుకోవడం భారత సైన్యపు మొట్టమొదటి ప్రాధాన్యత. అందుకే మొదట ద్రాస్ లో ఉన్న టైగర్ హిల్, టోలోలింగ్ కాంప్లెక్స్ ల మీద దాడి చేశారు . ఆ తదుపరి వెంటనే సియాచెన్ గ్లేషియర్ కి ప్రవేశం కల్పించే బటాలిక్-టుర్ టోక్ సబ్ సెక్టార్ మీద దాడి చేశారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన పర్వత శిఖరాలలో పాయింట్ 4590, పాయింట్ 5353లు పాకిస్తాన్ హస్తగతమై ఉన్నాయి. పాయింట్ 4590 కి NH 1D కనుచూపు మేరలో ఉంది. పాయింట్ 5353 ద్రాస్ సెక్టార్ లోనే అత్యంత ఎత్తున ఉన్న ప్రదేశం. అందువల్లే పాక్ దళాలకి NH 1D సులభంగా కనిపించే అవకాశం ఏర్పడింది. జూన్ 14న పాయింట్ 4590ని తిరిగి స్వాధీన పర్చుకున్న భారత సైన్యానికి ఈ చోటే అత్యధిక సంఖ్యలో సైనిక నష్టం జరిగింది. రహదారి పరిసర ప్రాంతాలలోని సైనిక స్థావరాలను జూన్ మధ్య నాటికి తిరిగి స్వాధీన పర్చుకున్నప్పటికీ, ద్రాస్ ప్రాంతంలోని రహదారి పైకి మాత్రం యుద్ధం ముగిసే వరకు శతఘ్నులతో దాడులు కొనసాగించింది పాకిస్థాన్.

NH 1D రహదారి కనిపించే కొండ ప్రాంతాలను తిరిగి స్వాధీన పర్చుకున్న తర్వాత భారత సైన్యం శతృవులను నియంత్రణ రేఖ అవతలకి తరిమికొట్టడం మీద దృష్టి పెట్టాయి. టోలోలింగ్ వద్ద జరిగిన యుద్ధం తర్వాత యుద్ధం భారత్ కు అనుకూలంగా మారింది. టోలోలింగ్ వద్ద పాకిస్తాన్ దళాలకి భారత్ లోని కాశ్మీర్ వేర్పాటువాదులు సహకరించారు. టైగర్ హిల్ (పాయింట్ 5140), పలు ఇతర చోట్ల గట్టి వ్యతిరేకత చూపించినా చివరికి విజయం భారత్‌నే వరించింది. పాక్ దళాలు టైగర్ హిల్ వద్ద పాతుకుపోయారని భారత్ సైన్యానికి అర్ధం అయ్యింది. అంతేగాక ఇక్కడ ఇరు పక్షాలకి బాగా ప్రాణ నష్టం సంభవించింది. చివరగా జరిపిన దాడిలో 10 మంది పాక్ సైనికులు, 5 గురు భారత సైనికులూ మృతి చెందగా, టైగర్ హిల్ భారత్ వశమైంది. మరికొన్ని పేరు లేని కొండలపై కూడా తీవ్ర పోరాటాలు జరిగాయి.

ఆపరేషన్ పూర్తిగా మొదలయ్యే సరికి దాదాపు 250 శతఘ్నులను కనుచూపు మేరలో ఉన్న సైనిక గుడారాలలోని చొరబాటుదారులని వెళ్ళగొట్టడానికి సిద్ధం చేశారు. బోఫోర్స్ ఫీల్డ్ హోవిట్జర్ లు చాలా ముఖ్య పాత్ర పోషించాయి. కొన్ని ప్రాంతాలలో వీటిని పూర్తి స్ధాయిలో భారత దళాలు ఉపయోగించుకున్నాయి. మిగిలిన ప్రాంతాలలో వీటిని మోహరించడానికి సరిపడా స్థలం లేకపోవడంతో అనుకున్న ఫలితాలు రాలేదు. పాక్ దళాలు పాతుకు పోయిన స్థలాల మీద భారత వైమానిక దళం లేసర్ గైడెడ్ బాంబులు ప్రయోగించింది.

అంతటి చలిలో, మంచు పర్వతాల్లో దాదాపు 60 రోజులపాటూ జరిగిన యుద్ధంలో ఇరుదేశాల సైనికులు చాలామంది చనిపోయారు. 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి, భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది. అందువల్ల ప్రతిఏటా జూలై 26 కార్గిల్ విజయ దినోత్సవం జరుపబడుతుంది. 1999, జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్థాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని  ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.