
గత వారం ఓ ఆరేళ్ల బాలుణ్ని పొట్టనబెట్టుకున్న కరడు గట్టిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఎట్టకేలకు గురువారం రాత్రి మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌బెహరా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు గతవారం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ జవాన్ సహా ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. అనంతరం బలగాలు జరిపిన కాల్పుల నుంచి తప్పించుకున్న ముష్కరుడు శ్రీనగర్‌లోకి ప్రవేశించాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి ఆ ఉగ్రవాది శ్రీనగర్‌లోని బల్‌బాగ్ ప్రాంతంలో నక్కి ఉన్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలతో కలిసి నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో దళాల కదలికల్ని పసిగట్టిన ముష్కరుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరపగా.. ఉగ్రవాది అక్కడికక్కడే హతమయ్యాడు. అతడు జమ్మూకశ్మీర్ ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన జహీద్ దాస్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఓ సీర్పీఎఫ్ జవాన్ కూడా అమరుడవడం విచారకరం.





