News

భద్రతా దళాలపై దాడికి యత్నిస్తున్న పాక్

116views

పాకిస్థాన్ వివిధ మార్గాల ద్వారా అనేక మంది ఉగ్రవాదులను జమ్మూ కశ్మీర్‌కు తరలించే ప్రయత్నం చేస్తోందని కేంద్రపాలిత పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్‌బాగ్‌ సింగ్‌ మంగళవారం వెల్లడించారు. భారత భద్రతా దళాలపై దాడి చేసేందుకు ఈ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. ”నౌషెరా, రాజౌరి-పూంచ్, కుప్వారా-కేరన్ సెక్టార్ల ద్వారా జైషే మొహమ్మద్‌, లష్కరే తొయిబా ఉగ్రవాదులను కశ్మీర్‌కు తరలించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. భద్రతా దళాలపై ఐఈడీ తరహాలో దాడి చేసేందుకు పాక్‌ యోచిస్తున్నట్లు సమాచారం అందింది. భారత సరిహద్దు, అంతర్గత దళాలు అప్రమత్తంగా ఉన్నాయి” అని పుల్వామా కాల్పుల్లో మృతిచెందిన ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాను అంతిమ సంస్కారాల అనంతరం దిల్‌బాగ్‌ సింగ్‌ వివరించారు.

182వ సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ సునిల్‌ కాలే పుల్వామాలోని బుంద్‌జూ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో మృతిచెందారు. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులను కూడా సైనిక దళాలు మట్టుబెట్టాయి. శ్రీనగర్ శివార్లలోని ఒక ప్రాంతంలో మంగళవారం భద్రతా దళాలు ఓ ఉగ్రవాద రహస్య స్థావరాన్ని కనుగొన్నాయి. పలు సామగ్రిని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలోనే దిల్‌బాగ్‌సింగ్‌ పాక్‌ చేస్తున్న ప్రయత్నాన్ని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.