News

సోనియా గాంధీకి లీగల్ నోటీసులు.. వీర్ సావర్కర్‌పై వ్యాఖ్యలతో వివాదం!

35views

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన పుస్తకం రాజకీయ, న్యాయపరమైన చర్చకు దారితీసింది. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి పుస్తకంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన మునిమనవడు సత్యకి సావర్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోనియా గాంధీకి న్యాయవాది సంగ్రామ్ కొల్హట్కర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. 15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సోనియా గాంధీ రచించిన Belonging: A Journey of Love పుస్తకాన్ని హార్పర్‌కోలిన్స్ పబ్లిషర్స్ ఇండియా నవంబర్ 10న ప్రచురించింది. ఈ పుస్తకంలోని 201, 443 పేజీల్లో సావర్కర్ గురించి చేసిన వ్యాఖ్యలపై సత్యకి అభ్యంతరం వ్యక్తం చేశారు.

బ్రిటిష్ పాలకుల చేతిలో కాంగ్రెస్ స్వాతంత్ర్య సమరయోధులు దాడులు, జైలు శిక్షలు ఎదుర్కొంటున్న సమయంలో సావర్కర్ బ్రిటిష్ పాలకులకు క్షమాభిక్ష పిటిషన్లు రాశారని, ఆర్ఎస్ఎస్ సభ్యులు బ్రిటిష్ అధికారులకు సమాచారదారులుగా వ్యవహరించారని పుస్తకంలో పేర్కొన్నట్లు నోటీసులో ప్రస్తావించారు.ఈ వ్యాఖ్యల వల్ల సావర్కర్ బ్రిటిష్ అధికారులకు స్వాతంత్ర్య సమరయోధుల సమాచారాన్ని అందించిన వ్యక్తిగా పాఠకులకు తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉందని సత్యకి ఆరోపించారు.

మహాత్మా గాంధీ సమకాలీనుడైన సావర్కర్ ప్రతిపాదించిన హిందుత్వ సిద్ధాంతం ప్రకారం భారత్ ప్రధానంగా హిందువుల ఆధిపత్యం కలిగిన దేశంగా ఉండాలనే భావన ఉందని, ఈ దృక్పథాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ, వాటి అనుబంధ సంస్థలు అనుసరిస్తున్నాయని పుస్తకంలో పేర్కొన్నట్లు నోటీసు తెలిపింది.ఈ వ్యాఖ్యలు సావర్కర్ రాజకీయ, సైద్ధాంతిక భావజాలాన్ని సరైన చారిత్రక నేపథ్యం లేకుండా చిత్రీకరిస్తున్నాయని సత్యకి అభ్యంతరం తెలిపారు.

అండమాన్ జైలు జీవితాన్ని ప్రస్తావించిన సత్యకి
బ్రిటిష్ పాలనలో సావర్కర్ అనుభవించిన సుదీర్ఘ కారాగార శిక్ష, అండమాన్‌లోని సెల్యులార్ జైలులో ఎదుర్కొన్న కష్టాలను కూడా నోటీసులో ప్రస్తావించారు. క్షమాభిక్ష పిటిషన్లను మాత్రమే ప్రస్తావిస్తూ, వాటి వెనుక ఉన్న పరిస్థితులు, చారిత్రక నేపథ్యాన్ని వివరించకపోవడం వల్ల ఆయన జీవిత చరిత్ర అసంపూర్ణంగా కనిపిస్తోందని ఆరోపించారు.

సత్యకి సావర్కర్ తన న్యాయ నోటీసులో మూడు ప్రధాన డిమాండ్లు చేశారు.
సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలి.
వివాదాస్పద వ్యాఖ్యలపై బహిరంగంగా వివరణ ఇవ్వాలి.

పుస్తకంలోని అభ్యంతరకర వ్యాఖ్యలను తదుపరి ముద్రణలు, డిజిటల్ సంచికల్లో సరిదిద్దాలి లేదా తొలగించాలి. నోటీసు అందిన తేదీ నుంచి 15 రోజుల్లోగా స్పందించాలని, లేనిపక్షంలో సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోనియా గాంధీ పుస్తకంలోని సావర్కర్ ప్రస్తావనలపై గతంలోనూ వివాదం చెలరేగింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన కొందరు నాయకులు పుస్తకంలోని వివాదాస్పద పేజీలను చించివేస్తూ నిరసన తెలిపారు. ఆ వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు.