News

కాశ్మీర్ లో 37 ఏళ్ల తర్వాత పునర్వైభవం సంతరించుకున్న 700 ఏళ్ల దుర్గేశ్వరి ఆలయం

4views

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో మత సామరస్యానికి, సమాజ ఐక్యతకు నిదర్శనంగా 700 ఏళ్ల పురాతన దుర్గేశ్వరి పాఠశాల ఆలయం పునర్వైభవాన్ని సంతరించుకుంది. శ్రీనగర్‌లోని ఫతే కడల్ ప్రాంతంలో ఉన్న ఈ చారిత్రక ఆలయం దాదాపు 37 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైంది. స్థానికుల సమిష్టి కృషితో ఆలయాన్ని పునరుద్ధరించడంతో తిరిగి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఈ ఆలయం సుల్తాన్ జైన్ ఉల్ అబిదీన్ (బుద్షా) పాలనాకాలంలో నిర్మితమైనదిగా భావిస్తున్నారు. కాశ్మీర్‌ చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయ పునరుద్ధరణలో స్థానిక కాశ్మీరీ పండిట్లు భాగస్వాములయ్యారు.

ఆలయ పునరుద్ధరణకు కాశ్మీరీ పండిట్ శశి టికూ చొరవ తీసుకున్నారు. సెప్టెంబర్‌లో ఆలయాన్ని సందర్శించిన సమయంలో శిథిలావస్థలో ఉన్న ప్రాంగణాన్ని చూసి చలించిపోయిన ఆయన, ఆలయాన్ని పరిరక్షించాలని నిర్ణయించుకున్నారు. తొలుత ఆలయానికి భద్రత కల్పించేందుకు గేటును ఏర్పాటు చేయించారు. అనంతరం అధికారులను సంప్రదించడంతో పాటు స్థానికుల సహకారంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు.

వాట్సాప్ గ్రూపుల ద్వారా స్థానికులను సమీకరించి విరాళాలు సేకరించారు. కొందరు రూ.700, రూ.1,000 విరాళంగా అందించగా, మరికొందరు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు సహకరించారు. ఆర్థిక సహాయంతో పాటు నీటి సరఫరా, పారిశుధ్యం, మరమ్మతు పనుల్లోనూ స్థానికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో. పోలీసు శాఖ, మున్సిపల్ అధికారులు సైతం అవసరమైన సహకారం అందించారు. స్థానిక నివాసి ఐజాజ్ అహ్మద్ సూఫీ మాట్లాడుతూ.. గతంలో ఈ ఆలయం భక్తులతో కళకళలాడేదని, 1980ల చివరలో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల కారణంగా కాశ్మీరీ పండిట్లు లోయను విడిచిపెట్టడంతో ఆలయంలో పూజలు నిలిచిపోయాయని గుర్తుచేశారు.

ఆలయ పునరుద్ధరణ హిందూ సోదరభావానికి అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మతాలకు అతీతంగా ఉమ్మడి వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.

ఈ ఆలయ సముదాయానికి విద్యాపరమైన చరిత్ర కూడా ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఎన్‌కే స్కూల్ పేరుతో స్వచ్ఛంద ప్రాథమిక పాఠశాల నిర్వహించేవారు. మత భేదాలు లేకుండా ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఉచిత విద్య అందించేవారు.

దశాబ్దాల నిర్లక్ష్యాన్ని అధిగమించి తిరిగి పూజలు ప్రారంభమైన ఈ ఆలయం.. కాశ్మీర్‌లో మత సామరస్యం, పరస్పర సహకారం, భారతీయ సంస్కృతిలోని సమైక్యతా భావానికి చక్కని నిదర్శనంగా నిలుస్తోంది.