
మహిళల వస్త్రధారణ, మతపరమైన స్వేచ్ఛపై ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖురాన్లో బుర్ఖా ధరించడం తప్పనిసరి అని ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, వినయం, మర్యాద అనేవి కేవలం మహిళలకే కాకుండా పురుషులకు కూడా వర్తించే విలువలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా షబానా అజ్మీ పలు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు.
– మతపరమైన బోధనలను కొందరు తమకు అనుకూలంగా అర్థం చేసుకుంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
– తాను బుర్ఖా ధరించనని, అయితే తన వస్త్రధారణ విషయంలో ఇతరులు ఆదేశాలు జారీ చేయడాన్ని అంగీకరించనని స్పష్టం చేశారు. ఎవరైనా బుర్ఖా ధరించవద్దని చెబితే మూడు బుర్ఖాలు ధరిస్తానంటూ తనదైన శైలిలో స్పందించారు.
– అదే సమయంలో సెక్యులరిజం పేరుతో కఠినమైన మతపరమైన వైఖరులను ప్రోత్సహించడం కూడా సరైనది కాదని పేర్కొన్నారు.
కేవలం గౌరవ పురస్కారాలు, అవార్డుల కోసం కళాకారులు రాజకీయాల్లోకి ప్రవేశించకూడదని కూడా షబానా అజ్మీ అభిప్రాయపడ్డారు. ప్రజలు అందించే ప్రేమ, గౌరవంతో పాటు సామాజిక బాధ్యత కూడా వస్తుందని, రాజకీయాల్లోకి వచ్చిన వారు సమాజ శ్రేయస్సు కోసం నిజాయితీగా పనిచేయాలని సూచించారు.
మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, మత విశ్వాసాలు, వస్త్రధారణపై స్వతంత్ర నిర్ణయాధికారం వంటి అంశాలపై షబానా అజ్మీ వ్యాఖ్యలు మరోసారి చర్చకు తెరలేపాయి.





