
( నవంబర్ 26 – భారత రాజ్యాంగ దినోత్సవం )
భారతదేశానికి సుదీర్ఘకాలపు పరాయిపాలన నుంచి విముక్తి కోసం వివిధ మార్గాల్లో జరిగిన పోరాటం ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించుకోడానికి వీలుగా ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ముందుగానే కలిగింది. దానికి అనుగుణంగా 1946 డిసెంబర్ 6న రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటైంది. మానసిక వలసవాదాన్ని నిర్మూలించడమే కాకుండా, జాతీయ లక్ష్యాన్ని నెరవేర్చే స్వల్పకాలిక, దీర్ఘకాలిక సంస్కరణలను ప్రవేశపెట్టడం కూడా రాజ్యాంగ పరిషత్తు పని.
1947 ఆగస్టు 14న పాకిస్తాన్, 15న భారతదేశం రెండు వేర్వేరు స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి. అంతకుముందే, అంటే 1947 ఫిబ్రవరి నాటికే, బెనెగల్ నరసింగరావు భారత రాజ్యాంగపు ప్రాథమిక ముసాయిదాను పూర్తి చేసారు. దాన్ని అధ్యయనం చేసి తుదిప్రతిని రూపొందించేందుకు 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసారు. దానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను అధ్యక్షుడిగానూ, మరో ఆరుగురిని సభ్యులుగానూ నియమించారు. ముసాయిదా కమిటీతో పాటు మరో 18 కమిటీలు, వాటి ఛైర్మన్లు, సభ్యుల నియామకం కూడా జరిగింది. మొత్తం పరిషత్తుకు బెనగల్ నరసింగరావు చట్టపరమైన సలహాదారుడిగా నియమితులయ్యారు. నరసింగరావు ముసాయిదాపై అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ విస్తృతంగా చర్చలు జరిపి పలు సవరణలు చేసింది. సవరించిన ముసాయిదాను రాజ్యాంగ పరిషత్తు ముందు 1947 నవంబర్ 4న ప్రవేశపెట్టారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ, పరిషత్తు ముందు ఉంచిన ముసాయిదాపై విస్తృతంగా చర్చలు జరిగాయి. మొత్తం 11సార్లు, 165 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. చివరకు, తుది ముసాయిదాను రాజ్యాంగ పరిషత్తు 1949 నవంబరు 26న ఆమోదించింది. ఆ రాజ్యాంగం 1950 జనవరి 26నుంచీ అమల్లోకి వచ్చింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి 2015లో జరిగింది. ఆ సందర్భంగా భారత ప్రభుత్వం ఏటా నవంబర్ 26న, అంటే తుది ముసాయిదాను పరిషత్తు ఆమోదించిన రోజును, సంవిధాన్ దివస్ లేదా రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది రాజ్యాంగ దినోత్సవం 77వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. రాజ్యాంగ దినోత్సవం అంటే కేవలం ప్రభుత్వ సెలవుదినం మాత్రమే కాదు. ఆరోజు భారత పౌరులకు, ప్రత్యేకించి యువతరానికి భారత రాజ్యాంగపు విలువలను పరిచయం చేయాలి. ప్రాథమిక విధులు, హక్కుల గురించి అవగాహన కల్పించాలి.
భారత రాజ్యాంగం కేవలం రాజ్యాంగ పరిషత్తు పలుమార్లు సమావేశమైన ఫలితం మాత్రమే కాదు. దాన్ని… స్వాతంత్ర్య సమరయోధుల సుదీర్ఘ స్వాతంత్ర్య పోరాటం, అంబేద్కర్ నాయకత్వంలో దళితుల సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటం, మత ప్రాతిపదికన దేశ విభజన వలన తలెత్తిన తక్షణ అశాంతిని సమతుల్యం చేసే ప్రయత్నాల ఫలితమే అని చెప్పవచ్చు. భారతదేశ వైవిధ్యాన్ని పరిరక్షించడం, అసమానతల నుంచి రక్షణ కల్పించడం అనే స్పష్టమైన ఉద్దేశాలతో, భిన్నాభిప్రాయాలకు చోటు కల్పించేందుకు రాజ్యాంగ పరిషత్తులో ప్రాంతం, మతం, కులం, భాష, సామాజిక హోదా మొదలైన విభిన్న నేపథ్యాలకు చెందిన సభ్యులను చేర్చారు. వారందరూ కలిసి రూపొందించిన భారత రాజ్యాంగం ఇవాళ దేశప్రజలకు, ప్రజాస్వామ్యానికీ పవిత్రగ్రంథంగా నిలిచింది.





