
ఇరాన్‌లో మహిళల హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛపై ప్రభుత్వ ఆంక్షలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. హిజాబ్ ధరించకుండా సంగీత ప్రదర్శన ఇచ్చారన్న ఆరోపణలతో ప్రముఖ గాయని పరస్తూ అహ్మదీతో పాటు ఆమె బృందంలోని నలుగురు సభ్యులకు 74 కొరడా దెబ్బల శిక్ష విధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నవంబర్ 23న ఈ శిక్ష అమలు చేసినట్లు సమాచారం.
2024 డిసెంబర్‌లో ఇరాన్‌లోని ఖోమ్ నగరంలో పరస్తూ అహ్మదీ తన సంగీత బృందంతో కలిసి ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఆమె హిజాబ్ ధరించకుండా పాటలు పాడారు. ప్రేక్షకులు లేకుండా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా, అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయి మిలియన్ల వ్యూస్ సాధించింది.
ఈ వీడియోపై ఇరాన్ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం జరిగిన విచారణలో పరస్తూ అహ్మదీతో పాటు ఆమె బృందంలోని నలుగురు పురుష సంగీతకారులకు 74 కొరడా దెబ్బల శిక్ష విధించినట్లు కథనాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా రెండేళ్ల పాటు విదేశీ ప్రయాణాలపై నిషేధం, సంగీతం మరియు ఇతర కళా కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించినట్లు సమాచారం.
ఇప్పటికే 2022లో మహ్సా అమిని పోలీసు కస్టడీలో మరణించిన ఘటన ఇరాన్‌లో మహిళల హక్కులు, హిజాబ్ నిబంధనలు, వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది.
తాజా ఘటనతో ఇరాన్‌లో మహిళల స్వేచ్ఛ, కళాకారుల భావప్రకటనా హక్కులు, ప్రభుత్వ ఆంక్షలపై అంతర్జాతీయంగా మరోసారి చర్చ మొదలైంది. కళకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఉన్న హక్కుల ప్రశ్నను ఈ పరిణామం మరోసారి ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది.





