News

ప్రకృతి ఒడిలో అచ్చమైన ఆర్గానిక్ పెళ్లి వేడుక

0views

నేటి కాలంలో వివాహం అంటే భారీ ఫంక్షన్ హాళ్లు, లక్షలాది రూపాయల ఖర్చు, రకరకాల వంటకాలు, ప్లాస్టిక్ అలంకరణలు సాధారణమైపోయాయి. కానీ ఓ ప్రకృతి ప్రేమిక రైతు మాత్రం తన కుమార్తె వివాహాన్ని ప్రకృతికి దగ్గరగా, పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 20 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆయన తన కుమార్తె పెళ్లిని కూడా పూర్తిగా ప్రకృతి ఆధారంగా జరిపించడం విశేషం.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన వ్యాపారవేత్త, ప్రకృతి వ్యవసాయ రైతు తుమ్మల సత్తిరెడ్డి తన కుమార్తె వీణ వివాహాన్ని మహారాష్ట్రకు చెందిన అజిత్‌తో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వివాహం సంప్రదాయ ఫంక్షన్ హాల్‌లో కాకుండా తన వ్యవసాయ క్షేత్రమైన ‘గోకులవనం’లో పచ్చని చెట్ల మధ్య ప్రకృతి ఒడిలో జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

22 రకాల వంటకాలు.. అన్నీ సేంద్రియమే!
వివాహానికి వచ్చిన అతిథులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో సత్తిరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రసాయన ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పప్పులు, ఇతర ఆహార ఉత్పత్తులతో పాటు గానుగ నూనె, దేశీ ఆవు నెయ్యిని మాత్రమే వంటల్లో వినియోగించారు.

అతిథుల కోసం ఏకంగా 22 రకాల సంప్రదాయ వంటకాలను సిద్ధం చేయించారు. వీలైనంత వరకు అవసరమైన వస్తువులను స్థానిక గ్రామంలోనే కొనుగోలు చేసి గ్రామీణ రైతులకు, వ్యాపారులకు కూడా ప్రోత్సాహం కల్పించారు.

రైతుల చేతులతోనే వంటలు.. ప్రకృతికి పెద్దపీట!
ఈ వివాహంలో మరో విశేషం ఏమిటంటే.. వంటలను కూడా రైతులే స్వయంగా సిద్ధం చేయడం. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనాథ్, తెలంగాణ గోశాలల సేవా సమితి అధ్యక్షుడు విజయరామ్, ప్రధాన కార్యదర్శి ఝాన్సీ లక్ష్మీభాయి, ప్రకృతి వ్యవసాయదారుడు గాదె అశోక్‌రెడ్డి పర్యవేక్షణలో వంటకాలు తయారయ్యాయి.

ప్లాస్టిక్ వస్తువులు, రసాయన ఆహార పదార్థాలకు దూరంగా ప్రకృతికి అనుకూలమైన పద్ధతిలో వివాహ వేడుకను నిర్వహించడం పలువురిని ఆకట్టుకుంది.

ప్రకృతిని కాపాడుతూ.. సంప్రదాయాన్ని గౌరవిస్తూ!
20 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరిస్తున్న సత్తిరెడ్డి తన జీవితంలో పాటిస్తున్న ప్రకృతి సిద్ధాంతాలను కుమార్తె వివాహంలోనూ అమలు చేశారు. ఆడంబరాలకు, అనవసర ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ రైతుల భాగస్వామ్యానికి పెద్దపీట వేశారు.

ఒక వివాహ వేడుక కూడా ప్రకృతికి మేలు చేసేలా నిర్వహించవచ్చని నిరూపించిన తుమ్మల సత్తిరెడ్డి కుటుంబం ప్రయత్నం ఇప్పుడు పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ ఆర్గానిక్ వివాహం ఒక చక్కని సందేశంగా నిలుస్తోంది.