
లక్నో:ధార్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణపై వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి పండిట్ ధీరేంద్రకృష్ణ శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువుల ధార్మిక ‘ప్రవచనాలను’ను అడ్డుకోవాలని చూస్తే, ఇతర మతాల ప్రార్థనా కార్యక్రమాల విషయంలోనూ అదే నిబంధన వర్తింపజేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో నవంబర్ 17 నుంచి 20 వరకు నిర్వహించిన ధార్మిక ప్రవచన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కుండా నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ (రాజా భయ్యా) ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ధీరేంద్రకృష్ణ శాస్త్రి నిర్వహించే కథా కార్యక్రమాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
“ఒకవేళ మీరు కథ ప్రవచనాలను ఆపితే, నమాజ్‌ను కూడా ఆపాల్సి ఉంటుంది. చర్చిల్లో జరిగే ప్రార్థనలను కూడా నిలిపివేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మొత్తం సామాజిక వ్యవస్థే దెబ్బతింటుంది. హిందువులు ఇప్పుడు మేల్కొంటున్నారు. తమ ధార్మిక హక్కుల విషయంలో స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేస్తున్నారు” అని ధీరేంద్రకృష్ణ శాస్త్రి పేర్కొన్నారు.
రామరాజ్యం అంటే ప్రజలందరూ సంతోషంగా ఉండే పాలన
రామరాజ్యం గురించి వివరిస్తూ.. ప్రజలందరూ సంతోషంగా, సురక్షితంగా జీవించే రాజ్యమే నిజమైన రామరాజ్యమని అన్నారు. కేవలం పాలకుడు మాత్రమే సంతోషంగా ఉండే పాలన రావణరాజ్యంతో సమానమని వ్యాఖ్యానించారు. మహిళలను కేవలం భోగవస్తువులుగా కాకుండా గౌరవంతో చూసే సమాజమే ఆదర్శ సమాజమని పేర్కొన్నారు. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని, ఆయన కంటే గొప్ప ఆదర్శం మరొకటి ఉండదని ధీరేంద్రకృష్ణ శాస్త్రి అన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీరాముడి జీవితం, ధర్మాచరణ, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.
రాజ్యాంగం మత ప్రచార హక్కును కల్పించింది
తాను ఒక నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగుతున్నప్పుడు అనేక చర్చలు, విమర్శలు రావడం సహజమని అన్నారు. తన ప్రత్యర్థులు వారి పని వారు చేసుకుంటున్నారని, తాను తన ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగంలోని 25, 26 అధికరణాలు మత స్వేచ్ఛ, మత సంస్థల నిర్వహణకు సంబంధించిన హక్కులను కల్పిస్తున్నాయని గుర్తుచేశారు. ఆ హక్కుల పరిధిలో ప్రతి ఒక్కరికీ తమ మత విశ్వాసాలను ఆచరించుకునే, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు.





