
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) దేశానికి ఒక సురక్షితమైన రక్షణ కవచం వంటిదని, దేశ ఐక్యత, భద్రత, భవిష్యత్తును కాపాడటంలో సంఘ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి కొనియాడారు. చాణక్య వార్తా ప్రకాశన్ గ్రూప్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘భారత్ గౌరవ్ ఉత్సవ్ 2026’ తొలిరోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల ఇతివృత్తంతో జరిగిన ఈ వేడుకలో, విజయ్ కుమార్ సంకలనం చేసిన ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తిథి దర్పణ్’ పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆర్.ఎన్. రవి మాట్లాడుతూ.. దేశాన్ని అంతర్గతంగా, జాతీయ స్థాయిలో బలహీనపరిచే శక్తులు పనిచేస్తున్న అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ఆ కుట్రలన్నింటినీ అడ్డుకుని, నేడు దేశసేవకు అంకితమైన మహా సంస్థగా 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గర్వకారణమన్నారు. సంఘ్ ప్రయాణంలోని చారిత్రక ఘట్టాలు, కచ్చితమైన తేదీలతో కూడిన ఈ పుస్తకం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సభకు అధ్యక్షత వహించిన ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యుడు భయ్యాజీ జోషి మాట్లాడుతూ.. సమాజంలో సంఘ్ ఒక గొప్ప పరివర్తన తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత్‌ను ఎవరూ అంతం చేయలేరని, ఎందుకంటే ఈ దేశ అంతర్గత శక్తి చాలా లోతుగా వేళ్లూనుకుని ఉందని స్పష్టం చేశారు. ప్రపంచంలో భారత్ ప్రాముఖ్యత ఎప్పటికీ చెక్కుచెదరదని, ఆ అంతర్గత శక్తికి ప్రతిరూపమే ఆర్ఎస్ఎస్ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్ మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీ లేదా పారిశ్రామికవేత్తల అండతోనో కాకుండా, స్వయంగా సమాజం నుంచే సంఘ్ తన శక్తిని పొందుతోందని, అందుకే వందేళ్ల మైలురాయిని చేరుకుందని తెలిపారు. ప్రపంచ శాంతి నెలకొనాలంటే భారత్ మరింత శక్తివంతం కావడం ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ (VHP) పోషకులు దినేష్ చంద్ర, ‘చాణక్య వార్త’ సంపాదకులు డాక్టర్ అమిత్ జైన్, అంతర్జాతీయ సలహాదారు కైలాష్ కండోయ్ తదితరులు పాల్గొన్నారు.





