News

ప్రతిరోజూ అదనంగా 5,000 వర్చువల్ క్యూ స్లాట్లు

9views

అయ్యప్ప దర్శనం కోసం వర్చువల్‌ క్యూ బుకింగ్‌లు పూర్తిగా నిండిపోతున్నాయి. వేలాది మంది భక్తులు ముందుగానే స్లాట్‌లు బుక్‌ చేసుకుంటున్నప్పటికీ.. వాస్తవంగా సన్నిధానానికి చేరుకుంటున్న వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. ఈ వ్యత్యాసం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. బుకింగ్‌లు భారీగా నమోదవుతున్నా దర్శనానికి భక్తులు ఎందుకు రావడం లేదు? దీని వెనుక ఏజెన్సీల ప్రమేయం ఉందా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

నిన్న అర్ధరాత్రి వరకు సుమారు 66 వేల మంది భక్తులు దర్శనం కోసం వర్చువల్‌ క్యూ ద్వారా బుకింగ్‌ చేసుకున్నట్లు సమాచారం. అయితే 18వ మెట్టు ఎక్కి అయ్యప్పస్వామిని దర్శించుకున్న వారి సంఖ్య 37,341 మందికే పరిమితమైంది. దీంతో బుకింగ్‌లకు, వాస్తవ దర్శనాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ క్రమంలో కొన్ని ట్రావెల్‌ ఏజెన్సీలు ముందుగానే పెద్ద సంఖ్యలో స్లాట్‌లు బుక్‌ చేసుకుంటున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడుకు చెందిన కొన్ని ట్రావెల్‌ ఏజెన్సీలు వందల సంఖ్యలో భక్తుల పేర్లతో ముందుగానే స్లాట్‌లు బుక్‌ చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతరం యాత్ర కోసం భక్తులు తమను సంప్రదించినప్పుడు ముందస్తు బుకింగ్‌లను రద్దు చేసి, కొత్తగా వచ్చే వారి ఆధార్‌ వివరాలు, ఫొటోలతో స్లాట్‌లు బుక్‌ చేస్తున్నాయనే అనుమానాలున్నాయి. భక్తులు సంప్రదించకపోతే ముందుగా బుక్‌ చేసిన స్లాట్‌లు ఖాళీగా మిగిలిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే సన్నిధానంలోని అరవణ ప్రసాదం కౌంటర్ల వద్ద సాధారణంగా కనిపించే రద్దీ ప్రస్తుతం తగ్గినట్లు తెలుస్తోంది. భక్తులు లేక కౌంటర్లు వెలవెలబోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, గత తులామాస పూజల సమయంలోనూ ఆన్‌లైన్‌ గదుల బుకింగ్‌లలో కొన్ని ఏజెన్సీల జోక్యం ఉన్నట్లు విజిలెన్స్‌ తనిఖీల్లో గుర్తించినట్లు సమాచారం. అప్పట్లో కొన్ని ఏజెన్సీలు రోజుకు సుమారు 22 గదుల వరకు బుక్‌ చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో వర్చువల్‌ క్యూ ఐడీ, ఆధార్‌, ఓటీపీ ధ్రువీకరణ వంటి నిబంధనలను తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో వర్చువల్‌ క్యూ బుకింగ్‌లు పూర్తిగా నిండిపోయినా భక్తులు దర్శనానికి ఎందుకు రావడం లేదనే అంశంపై దేవస్థానం బోర్డు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. బుకింగ్‌ల వెనుక ఏజెన్సీల ప్రమేయం ఉందా? స్లాట్‌లను ఇతరులకు బదిలీ చేస్తున్నారా? లేక వ్యక్తిగత కారణాలతో భక్తులు యాత్రకు రావడం లేదా? అనే కోణాల్లో పరిశీలించనున్నారు.