
రాజమహేంద్రవరం మహిళా ప్రత్యేక కారాగారంలో ఖైదీలను క్రైస్తవ మతంలోకి మారేలా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఖైదీల వ్యక్తిగత, ఆరోగ్య, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి వివిధ రకాల హామీలు ఇస్తూ మత మార్పిడికి ప్రేరేపిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ జైలులో సుమారు 70 మంది మహిళా ఖైదీలు, 30 మంది వరకు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. జైలు సూపరింటెండెంట్ వసంతకుమారిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రైస్తవ మతాన్ని అనుసరించే ఖైదీల పట్ల ఒక విధంగా, ఇతర మతాలకు చెందిన ముఖ్యంగా హిందూ ఖైదీల పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది.
బెయిల్ త్వరగా వస్తుందని, ఆరోగ్య సమస్యలు నయమవుతాయని, మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని ఆశ చూపుతూ కొందరు ఖైదీలను మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సుమారు 20 మంది ఖైదీలను మత మార్పిడికి సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం కూడా జైలులో కలకలం రేపుతోంది.
ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయిన ఓ పోస్టర్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ‘సోల్జర్స్ ఫర్ జీసస్ – జైళ్ల శాఖ – సహవాస ఆత్మీయ కలయిక’ పేరుతో ఉన్న పోస్టర్ను సూపరింటెండెంట్ వసంతకుమారి ప్రచారం చేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జైలు ప్రాంగణంలో మతపరమైన కార్యక్రమాల నిర్వహణపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మత మార్పిడికి అంగీకరించని ఖైదీలపై వేధింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ, సంబంధిత అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది.
ఖైదీల మత స్వేచ్ఛకు భంగం కలగకుండా, జైలు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి మతపరమైన ఒత్తిళ్లు జరగకుండా ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




