News

ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతం చేయాలి

26views

శ్రీకాకుళం: జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర రైతు సాధికార సంస్థ (RySS) ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. విజయ్ కుమార్ సూచించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాల వల్ల వ్యవసాయ రంగానికి ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ అమలుపై ఎంఎఫ్‌ఏలు, ఎఫ్‌ఎంపీటీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, మెంటార్లతో చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లాలో వరి, జీడిపప్పు, కొబ్బరి, మొక్కజొన్న తదితర పంటల్లో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలను అధికారులు వివరించారు. వినూత్న సాగు విధానాలు, రైతులు సాధిస్తున్న ఫలితాలను క్షేత్రస్థాయి సిబ్బంది సమావేశంలో వివరించారు.

భూమిని ఏడాది పొడవునా పంటలతో కప్పి ఉంచాలని విజయ్ కుమార్ సూచించారు. తద్వారా నేలపై సూర్యరశ్మి నేరుగా పడకుండా చేసి భూమిలో తేమను కాపాడుకోవచ్చని తెలిపారు. పంటల వైవిధ్యాన్ని పెంచడం ద్వారా వ్యవసాయాన్ని మరింత స్థిరంగా కొనసాగించవచ్చని పేర్కొన్నారు.

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని, ప్రకృతి వ్యవసాయాన్ని క్షేత్రస్థాయిలో మరింత విస్తరించేలా అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.