News

కోయంబత్తూరు బాంబు పేలుళ్ల ముస్లిం ఖైదీల విడుదలకు ఎంఎంకే డిమాండ్‌

34views

తమిళనాడులో ముస్లిం జీవిత ఖైదీల విడుదల డిమాండ్‌ తీవ్ర చర్చకు దారితీసింది. 1998లో కోయంబత్తూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 14 మంది సహా మొత్తం 22 మంది ముస్లిం ఖైదీలను విడుదల చేయాలని మనితనేయ మక్కల్ కట్చి (ఎంఎంకే) డిమాండ్ చేసింది. ఈ మేరకు చెన్నైలో సుమారు 10 వేల మందితో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. అయితే 58 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల విడుదల అంశం తెరపైకి రావడంతో బాధిత కుటుంబాలకు న్యాయం, ప్రజల భద్రత, శిక్షల ఉద్దేశం వంటి కీలక ప్రశ్నలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

1998 ఫిబ్రవరి 14న కోయంబత్తూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అప్పటి భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఎన్నికల ప్రచార సభను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ పేలుళ్లలో 58 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో పలువురికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం విడుదల చేయాలని ఎంఎంకే కోరుతున్న 22 మందిలో 14 మంది ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్నవారే.

దాదాపు 28 ఏళ్లుగా జైలులో ఉన్నారనే కారణంతో జీవిత ఖైదీలను విడుదల చేయాలని కోరడం సరైన విధానమేనా? ముఖ్యంగా భారీ ప్రాణనష్టం కలిగించిన ఉగ్రదాడి కేసులో శిక్ష పడినవారి విషయంలో బాధిత కుటుంబాల అభిప్రాయాలకు, న్యాయపరమైన అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

జీవిత ఖైదు అనేది సాధారణ శిక్ష కాదు. న్యాయస్థానం నిర్ధారించిన నేర తీవ్రత, బాధితులకు జరిగిన నష్టం, ఖైదీల ప్రవర్తన, చట్టపరమైన అర్హతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం రాజకీయ ఒత్తిళ్లు లేదా మతపరమైన గుర్తింపుల ఆధారంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఎంఎంకే అధినేత వాదన ఏమిటి?
ఈ డిమాండ్‌పై ఎంఎంకే అధినేత డాక్టర్ ఎం.హెచ్. జవాహిరుల్లా స్పందిస్తూ.. ఖైదీలు తమ జీవితంలో ఎక్కువ భాగాన్ని జైలులోనే గడిపారని పేర్కొన్నారు. గతంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఒక కమిషన్ సిఫారసుల మేరకు ఇతర మతాలకు చెందిన ఖైదీలతో పాటు ఇలాంటి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 41 మందిని విడుదల చేసినట్లు గుర్తుచేశారు.

అయితే కోయంబత్తూరు పేలుళ్ల వంటి తీవ్రమైన కేసుల్లో విడుదలకు సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి ఖైదీ కేసును విడివిడిగా పరిశీలించడం, చట్టపరమైన నిబంధనలను పాటించడం అత్యంత కీలకం.

రిజర్వేషన్ల పునరుద్ధరణ కూడా మరో డిమాండ్‌
ఖైదీల విడుదలతో పాటు ముస్లిం మతంలోకి మారిన వెనుకబడిన తరగతులు (బీసీ), అత్యంత వెనుకబడిన తరగతులు (ఎంబీసీ), డీనోటిఫైడ్ కమ్యూనిటీలకు చెందిన వారికి గతంలో అమలైన 3.5 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరించాలని ఎంఎంకే డిమాండ్ చేసింది. ప్రస్తుతం డీఎంకేకు మిత్రపక్షంగా ఉన్న ఈ పార్టీ, తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఎన్నికల అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపైనా ఈ అంశాలపై నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెస్తోంది.