
విశాఖపట్నం: విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, మహిళా సాధికారతకు తోడ్పడటమే లక్ష్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ‘మిషన్ సాహసి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినులకు వారం రోజుల పాటు స్వీయరక్షణలో ప్రత్యేక శిక్షణ అందించారు.
శిక్షణ ముగింపు సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో విద్యార్థినులు తాము నేర్చుకున్న ఆత్మరక్షణ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్వైకేఎస్ మాజీ వైస్ చైర్మన్ పేరల చంద్రశేఖరరావు, వెస్ట్ జోన్ ఏసీపీ పి. ప్రదీప్తి తదితరులు పాల్గొని విద్యార్థినులను అభినందించారు. మహిళలు ఆత్మరక్షణపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వారు సూచించారు.
మహిళల్లో ధైర్యసాహసాలను పెంపొందిస్తూ, స్వీయరక్షణ నైపుణ్యాలను ప్రతి విద్యార్థినికి చేరువ చేయడంలో ‘మిషన్ సాహసి’ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.




