
అన్నపూర్ణ చిన్నతనం నుంచే కళలకు సంబంధించిన వాతావరణంలో పెరిగారు. ఆమె తండ్రి రోహిణీ కుమార్ స్వయంగా చిత్రకారుడు. ఇంట్లోని ప్రతి గోడపై ఏదో ఒక పెయింటింగ్ కనిపించేదని ఆమె గుర్తుచేసుకున్నారు. రోజువారీ జీవితంలో కనిపించే వస్తువుల్లోనూ కళాత్మకతను గుర్తించి, వాటి అమరిక, ఆకృతులు, కంపోజిషన్ గురించి తండ్రి చర్చించేవారని తెలిపారు.
మేనత్తలు, బాబాయిలు సంగీతం, వీణ, మృదంగం, వయొలిన్ వంటి కళల్లో నైపుణ్యం కలిగి ఉండటంతో చిన్నతనం నుంచే కళల పట్ల ఆసక్తి పెరిగిందని చెప్పారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఆమె పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పెయింటింగ్‌లో విద్యను అభ్యసించారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.
ఆర్టిస్ట్ నుంచి క్యూరేటర్‌గా..
తండ్రి ప్రభావంతో చిత్రకళపై ఆసక్తి పెంచుకున్న అన్నపూర్ణ.. కాలక్రమంలో శిల్పాలు, మినియేచర్ కళలు, సమకాలీన చిత్రకళపై కూడా అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఆలయాలను సందర్శించినప్పుడు అక్కడి ద్వారాలు, శిల్పాలు, చెక్కడాల్లోని కళాత్మకతను పరిశీలించడం అలవాటైంది. చరిత్రపై ఉన్న ఆసక్తి కూడా ఆమెను క్యూరేటింగ్ వైపు నడిపించింది.
ప్రత్యేకంగా క్యూరేటింగ్కు సంబంధించిన కోర్సులు చేయకపోయినా, ఒక ఆర్ట్ గ్యాలరీలో పనిచేస్తూ అనుభవం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె తెలిపారు. అక్కడి నుంచి వచ్చిన అవకాశాలతో వివిధ నగరాల్లో కళాప్రదర్శనలను నిర్వహించారు. చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లోనూ తన క్యూరేటర్ ప్రయాణాన్ని కొనసాగించారు.
కొవిడ్ సమయంలో ‘చిత్రం’ పేరుతో సినిమాల నేపథ్యంగా ఒక ప్రత్యేక ఆర్ట్ షో నిర్వహించారు. ఆ సమయంలో సినిమాలు ప్రజలకు వినోదాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాయని, సినీ ప్రముఖుల ప్రభావం సమాజంపై ఎంతగా ఉంటుందో గుర్తించినట్లు ఆమె వివరించారు. అనంతరం తన కళాప్రదర్శనలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ‘ఏక్ చిత్ర’ పేరుతో ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు.
ఆలయ కళా వైభవాన్ని చాటుతున్న ‘లివింగ్ టెంపుల్’..
ప్రస్తుతం అన్నపూర్ణ నిర్వహిస్తున్న ‘లివింగ్ టెంపుల్’ ఆర్ట్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారతీయ దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాకుండా శిల్పకళ, వాస్తుశిల్పం, చిత్రకళకు నిలయాలని ఆమె అభిప్రాయపడుతున్నారు.
ఆలయాల కళా వైభవానికి సంబంధించిన సమాచారం తగిన స్థాయిలో పుస్తకాల్లో అందుబాటులో లేకపోవడం తనను ఆలోచింపజేసిందని తెలిపారు. ఈ కళా సంపద గురించి రాబోయే తరాలకు ఎలా తెలియజేయాలనే ఆలోచనతో ఈ ప్రదర్శనకు రూపకల్పన చేసినట్లు చెప్పారు.
ఈ ప్రదర్శన కోసం పరిశోధన చేయడం, కళాకారులను కలవడం, వారి కళాకృతులను ఎంపిక చేయడం వంటి పనులకు దాదాపు రెండేళ్లు పట్టిందని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. ఈ ప్రదర్శనను నెల రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఏటా ఈ తరహా కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లోనూ కళా ప్రదర్శనలు..
కళను కేవలం ఆర్ట్ గ్యాలరీలకే పరిమితం చేయకుండా సామాన్య ప్రజలకు కూడా చేరువ చేయాలన్నది అన్నపూర్ణ మరో లక్ష్యం. ఇందులో భాగంగా తెలంగాణలో జరగనున్న భారీ కళాప్రదర్శన ‘బినాలే’ నిర్వహణలో భాగస్వామ్యం కానున్నారు.
స్నేహితురాలు కల్పనా రమేష్‌తో కలిసి ఈ కార్యక్రమ బాధ్యతలను చేపట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని మెట్లబావుల పరిసరాల్లో 12 ప్రాంతాల్లో 40 రోజులపాటు ఈ కళాప్రదర్శన నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు.
హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఐటీ రంగం మాత్రమే కాదని.. నగరానికి గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వం కూడా ఉందని అన్నపూర్ణ పేర్కొన్నారు. ఆ వారసత్వాన్ని మాటల ద్వారా చెప్పడం కంటే ప్రజలు ప్రత్యక్షంగా చూసి, అనుభూతి చెందేలా చేయాలన్నదే ఈ ప్రయత్నం వెనుక ఉన్న ఉద్దేశమని వివరించారు.
కళపై ప్రేమతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే బాధ్యతతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు అన్నపూర్ణ మడిపడగ తెలిపారు.





