
ఈ కార్యక్రమంలో మనీష్ మెహతాను ‘శ్రీ సనాతన భారత్’ ప్రాజెక్ట్ హెడ్‌గా నియమించారు. దేశవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు డివిజనల్, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సనాతన హిందువులతో పాటు సిక్కులు, బౌద్ధులు, జైనులు, వివిధ కులాలు, ఉపకులాలకు చెందిన వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వ్యాపార రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 1 నుంచి వ్యాపార సంస్థలు తమ ప్రకటనల్లో ‘సనాతన చిహ్నాన్ని’ చేర్చాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ చిహ్నంలో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని తెలిపారు. ఈ గుర్తు ద్వారా ఆయా వ్యాపార సంస్థలు ‘సనాతన్ ధృవీకరణ’ పొందినవిగా గుర్తించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హేమంత్ పటేల్ మాట్లాడుతూ.. ఇతర మత వర్గాల్లో హలాల్, కోషర్ వంటి ప్రత్యేక ధృవీకరణ విధానాలు ఉన్నాయని, హిందువుల కోసం కూడా ఇటువంటి ప్రత్యేక వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే హిందూ వినియోగదారులు, వ్యాపారవేత్తలకు ఒక ప్రత్యేక వేదికను అందించాలనే ఉద్దేశంతో ‘శ్రీ సనాతన భారత్’ను ప్రారంభించినట్లు వివరించారు.
దేశవ్యాప్తంగా సంస్థను విస్తరించే బాధ్యతను స్వీకరించిన మనీష్ మెహతాకు ఈ సందర్భంగా హేమంత్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన పలువురు సనాతన ధృవీకరణ చిహ్నంతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించి ఈ కార్యక్రమానికి తమ మద్దతు ప్రకటించారు.
సనాతన ధర్మ అనుచరుల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు, వ్యాపార రంగంలో పరస్పర సహకారం, అనుసంధానాన్ని బలోపేతం చేయడమే ఈ డిజిటల్ వేదిక లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు.





