
హైదరాబాద్: అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టే హిందూ పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాసి పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అయ్యప్ప స్వామి మాల ధరించి 41 రోజుల మండల దీక్ష చేపట్టే పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన వెసులుబాటు కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇతర ఉద్యోగుల మాదిరిగానే అయ్యప్ప దీక్షాధారులైన హిందూ ఉద్యోగులకు కూడా సమాన హక్కులు, అవకాశాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని రాజాసింగ్ పేర్కొన్నారు. అయ్యప్ప మాల ధరించి నియమనిష్ఠలతో 41 రోజుల పాటు దీక్ష చేపట్టడం హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసం, భక్తికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు.
ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే ఆధ్యాత్మిక నియమాలను పాటించాలనుకునే దీక్షాధారులకు ప్రభుత్వం తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టే పోలీసు, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.





