News

మహర్షి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ పరిశోధనలకు ఇస్రో శాస్త్రవేత్తల ప్రశంసలు

33views

పణాజీ: భారతీయ జ్ఞాన వ్యవస్థ (Indian Knowledge System) ఆధారంగా మహర్షి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం చేపడుతున్న పరిశోధనా కార్యక్రమాలను ఇస్రో శాస్త్రవేత్తలు అభినందించారు. ఆధ్యాత్మికత, శాస్త్రీయ పరిశోధనల సమన్వయంతో సాగుతున్న విశ్వవిద్యాలయ కృషిపై వారు ఆసక్తి వ్యక్తం చేశారు.

గోవాలోని డోనా పౌలాలో అక్టోబర్ 25 నుంచి 30 వరకు ఐక్యరాజ్యసమితి బాహ్య అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం (UNOOSA) మార్గదర్శకత్వంలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ కమిటీ (ICG) రెండవ వార్షిక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇస్రో, భారత అంతరిక్ష విభాగం సంయుక్తంగా ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాయి.

ఈ కార్యక్రమానికి ధర్మగురువుగా హాజరు కావాల్సిందిగా అఖిల భారతీయ సంత సమితి, ధర్మ సమాజ్ (మహారాష్ట్ర విభాగం) అధిపతి మహాంత్ ఆచార్య పీఠాధీశ్వర్ డాక్టర్ అనికేతశాస్త్రి దేశ్‌పాండేను నిర్వాహకులు ఆహ్వానించారు. ఆయన సూచనల మేరకు మహర్షి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ పరిశోధనా విభాగం అధిపతి శ్రీ సీన్ క్లార్క్, పరిశోధనా సమన్వయకర్త శ్రీమతి శ్వేత క్లార్క్ సదస్సుకు హాజరయ్యారు. సనాతన సంస్థకు చెందిన శ్రీ ధనంజయ హర్షే కూడా పాల్గొన్నారు.

అయోధ్య రామమందిరం, హిందూ స్వస్తికపై పరిశోధనల వివరణ
సదస్సు సందర్భంగా ఇస్రో అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ మనీష్ చావ్లా, శాస్త్రవేత్త శ్రీ గార్గ్‌లతో మహర్షి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ స్థాపకులు సచ్చిదానంద పరబ్రహ్మ డాక్టర్ జయంత్ బాలాజీ అఠవలే మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక పరిశోధనల గురించి శ్రీ సీన్ క్లార్క్ వివరించారు.

ముఖ్యంగా అయోధ్యలోని శ్రీరామ మందిరంపై అధ్యయనాలు, హిందూ స్వస్తికకు, నాజీ స్వస్తికకు మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక వ్యత్యాసాలపై చేపడుతున్న పరిశోధనల గురించి తెలియజేశారు. ఈ పరిశోధనల ద్వారా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు, సనాతన ధర్మంలోని జ్ఞాన సంపదను వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు.

పరిశోధనా కేంద్రాన్ని సందర్శిస్తామని ఇస్రో శాస్త్రవేత్తల వెల్లడి
మహర్షి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం చేపడుతున్న పరిశోధనా కార్యక్రమాలను శ్రీ మనీష్ చావ్లా, శ్రీ గార్గ్ అభినందించారు. పోండాలోని ఆధ్యాత్మిక పరిశోధనా కేంద్రంతో పాటు సనాతన ఆశ్రమాన్ని తాము, తమ బృంద సభ్యులు సందర్శిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ అనికేతశాస్త్రి దేశ్‌పాండే విశ్వవిద్యాలయ పరిశోధనల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయ జ్ఞాన వ్యవస్థ ఆధారంగా మానవాళి శ్రేయస్సు కోసం కొనసాగుతున్న ఈ పరిశోధనలకు తన సంపూర్ణ మద్దతు, ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. నాసిక్‌లో జరగనున్న కుంభమేళాకు కూడా తన ఆశీస్సులు అందించారు.