
సేవ అనేది వ్యాపారం కాదని, అది సమాజం పట్ల ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక అభివృద్ధితోనే సమాజం నిలబడదని, కరుణ, సున్నితత్వం, నిస్వార్థం వంటి మానవీయ విలువలే సమాజానికి అసలైన పునాది అని ఆయన పేర్కొన్నారు. నాగ్‌పూర్ సివిల్ లైన్స్‌లోని చిట్నవిస్ సెంటర్లో ‘కృషి వికాస్ ప్రతిష్ఠాన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దుబాయ్‌లోని కార్మికులకు వైద్య సేవలందిస్తున్న నాగ్‌పూర్ వాసి డాక్టర్ సంజయ్ పైఠంకర్కు ‘విదర్భ గౌరవ్ పురస్కారం’ ప్రదానం చేసిన సందర్భంగా భాగవత్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
ప్రపంచమంతా దేనినైతే ‘వృత్తి’ (Profession) అని పిలుస్తుందో, మన దేశంలో దానిని ‘సేవ’గా భావిస్తామని భాగవత్ గుర్తుచేశారు. జీవనోపాధి కోసం డబ్బు సంపాదించడం జీవితంలో ఒక భాగం మాత్రమేనని, కేవలం ధనార్జనే ఏ పనికీ ప్రధాన లక్ష్యం కాకూడదని అన్నారు. పురస్కారాలు అనేవి సేవ చేయడానికి ప్రేరణ కలిగించేవి కావని, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారికి ఇచ్చే గుర్తింపు మాత్రమేనని చెప్పారు. తోటివారి కష్టాలను చూసి స్పందించే సున్నితత్వమే మానవత్వానికి అసలైన గీటురాయని, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆ సున్నితత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
భారతీయ సంస్కృతిలో ధర్మం అంటే మానవత్వం, సోదరభావంతో ముడిపడి ఉందని, సత్యం, దయ, పవిత్రత, తపస్సు అనే నాలుగు స్తంభాలపై ధర్మం నిలబడి ఉందని భాగవత్ వివరించారు. ఎదుటివారిలోనూ భగవంతుడిని చూసే భావనే నిస్వార్థ సేవకు దారితీస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ… నాగ్‌పూర్ మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన ఎందరో వైద్యులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని, వారిలో డాక్టర్ సంజయ్ పైఠంకర్ దుబాయ్‌లో ఉంటూనే మాతృభూమితో అనుబంధాన్ని కొనసాగిస్తూ నాగ్‌పూర్ కీర్తిని ఇనుమడింపజేశారని ప్రశంసించారు. ఈ వేడుకలో డాక్టర్ వేదప్రకాశ్ మిశ్రా, ప్రతిష్ఠాన్ అధ్యక్షుడు గిరీష్ గాంధీ, శ్రీరామ్ కాలే తదితరులు పాల్గొన్నారు.





