News

‘‘నమాజ్ చేసిన ప్రాంతానికి వెళ్తున్నారు’’.. అఖిలేష్ ‘‘రామమందిర’’ సందర్శనపై ఓవైసీ వ్యాఖ్యలు..

0views

లక్నో: అయోధ్యలోని భవ్య రామమందిరం దేశవ్యాప్తంగా హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రామమందిర దర్శనానికి వెళ్లనుండటం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 12న శ్రీరాముడిని దర్శించుకోనున్నట్లు ప్రకటించడంతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శలకు దిగారు. ఒక నాయకుడు శ్రీరాముడిని దర్శించుకోవడంపై రాజకీయ విమర్శలు చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో తన కొత్త రాజకీయ కూటమి ‘సామాజిక్ పరివర్తన్ మోర్చా’ నిర్వహించిన తొలి బహిరంగ సభలో ఓవైసీ మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు ముస్లింలు ప్రార్థనలు చేసిన ప్రాంతానికి అఖిలేష్ వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. మసీదులు, మదర్సాలు కూల్చివేసిన ప్రాంతాలను సందర్శించేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోట్లాది మంది హిందువుల చిరకాల ఆకాంక్షకు నిదర్శనమనే విషయాన్ని ఓవైసీ విస్మరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2024 జనవరిలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత అఖిలేష్ అయోధ్యకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనపై ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ ప్రచారం చేస్తున్న PDA నినాదంపైనా ఓవైసీ విమర్శలు గుప్పించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలను కలిపి రాజకీయంగా సమీకరించేందుకు ఎస్పీ ఉపయోగిస్తున్న PDA నినాదాన్ని ‘పలట్ దియా అఖిలేష్’ అంటూ ఎద్దేవా చేశారు.

2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లను ప్రస్తావిస్తూ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వేలాది మంది ప్రజలు ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఆరోపించారు. ఎస్పీకి 47 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ముస్లింలకు ఏం చేశారని ప్రశ్నించారు.

అయితే రామమందిర దర్శనం వంటి ఆధ్యాత్మిక అంశాన్ని కూడా రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని దర్శించుకోవడం ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయమని, దానిని రాజకీయ వివాదంగా మార్చాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.