
ఏలూరు: వెదురు ఆధారిత పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడం ద్వారా గిరిజన, గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ పి.వి. చలపతిరావు అధికారులకు సూచించారు.
ఏలూరు అటవీ డివిజన్ పరిధిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం ముంజులూరు బీసీ-III ప్రాంతంలోని వెదురు అటవీ ప్రాంతాలు, కోత కేంద్రాలు, నిల్వ కేంద్రాలను పరిశీలించారు. వన సంరక్షణ సమితుల సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడి వారి జీవనోపాధి అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు.
కన్నాపురం ప్రాంతంలో వెదురు శుద్ధి, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు కొత్త నర్సరీలను అభివృద్ధి చేయాలని సూచించారు. చీమలవారిగూడెంలో రైతులకు వెదురు మొక్కలను పంపిణీ చేశారు. పొలం గట్లపై, ఇళ్ల ఆవరణల్లో వెదురు సాగు చేపట్టి అదనపు ఆదాయం పొందాలని రైతులకు పిలుపునిచ్చారు. వెదురు వనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ప్రకాశరావుపాలెం నగరవనాన్ని సందర్శించి మియావాకి ప్లాంటేషన్, నర్సరీ నిర్వహణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్తీక వనమహోత్సవం, వనభోజన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో రాజమహేంద్రవరం సర్కిల్ సీసీఎఫ్ డాక్టర్ జ్యోతి తుల్లిమెల్లి, ఏలూరు డీఎఫ్ఓ పి.వి. సందీప్ రెడ్డి, ఏపీఎఫ్డీసీ డివిజనల్ మేనేజర్ ఎ. సత్యకళతో పాటు పలువురు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.





