
(నవంబర్ 15 – భగవాన్ బిర్సా ముండా జయంతి)
బిర్సా ముండా 1875 నవంబర్ 15న నాటి బెంగాల్ ప్రెసిడెన్సీలో, ప్రస్తుతం ఝార్ఖండ్ రాష్ట్రం ఖుంటీ జిల్లాలోని ఉలిహాటు గ్రామంలో జన్మించాడు. ముండా తెగవారి సంప్రదాయం ప్రకారం, ఆయన పుట్టినరోజయిన గురువారం పేరిట అతనికి బిర్సా అని పేరు పెట్టారు. అప్పటికే బ్రిటిష్ పాలకులు గిరిజనుల వ్యవసాయ పద్ధతి స్థానంలో ఫ్యూడల్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ముండా, ఆరగావ్ తదితర గిరిజన తెగల నాయకుల అధికారాలను లాగేసుకుని, అటవీ ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నారు.
మరోవైపు, క్రైస్తవ మిషనరీలు విద్యాబోధన పేరుతో పిల్లలను మతం మారుస్తున్నారు. వారే బిర్సా ముండాను బిర్సా డేవిడ్‌గా మార్చేసారు. ఆదివాసీ సమాజపు సాగు పద్ధతిని మార్చేయడం, తమ సంస్కృతీ సంప్రదాయాలను రూపుమాపేయడం అనే రెండు సవాళ్ళను బిర్సా ముండా చాలాత్వరగా అర్థం చేసుకున్నాడు. ముండా తెగ నాయకుడిగా, బ్రిటిష్ దొరతనం మీద వరుస తిరుగుబాట్లు చేసాడు. భూమిపుత్రులుగా తమ హక్కుల కోసం ఉద్యమం చేసాడు. వరుస దాడులతో తెల్లదొరతనాన్ని గడగడలాడించాడు. 1898, 99 రెండేళ్ళలో బిర్సా తమ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లు, చర్చిల మీద దాడులు చేసాడు. పలువురు పోలీసులను హతమార్చాడు.
పట్టుమని పాతికేళ్ళు నిండని ఆ గిరిజన యువ నాయకుడు బ్రిటిష్ వారిని తీవ్రంగా కలవరపెట్టాడు. 1900 మార్చి 3న, బిర్సా ముండా తన గిరిజన గెరిల్లా సైనికులతో కలసి జంకోపాయి అటవీప్రాంతంలో నిద్రిస్తున్నప్పుడు బ్రిటిష్ వారు అతన్ని పట్టుకున్నారు. మొత్తం 460మందిని అరెస్టు చేసారు. వారిలో ఒకరికి మరణ శిక్ష, మిగతావారికి ప్రవాస ద్వీపాంతర శిక్షలు, 14ఏళ్ళ జైలుశిక్షలూ విధించారు. ఆ క్రమంలో బిర్సాను రాంచీ జైల్లో నిర్బంధించారు. జూన్ 9న బిర్సా ముండా ఆ జైల్లోనే చనిపోయాడు.
విక్టోరియా రాణి పాలన అంతం, బిర్సాల పాలన ఆరంభమే లక్ష్యంగా… బిర్సా ముండా తెల్లదొరతనంతో పోరాడింది గట్టిగా రెండేళ్ళే. అతని మరణంతో తిరుగుబాటూ ముగిసిపోయింది. కానీ ఆ ఉద్యమం రెండు ప్రధానమైన మార్పులు తేగలిగింది. మొదటిది… గిరిజనుల భూమిని గిరిజనేతరులు సులువుగా లాగేసుకోకుండా వలస ప్రభుత్వం చట్టాలు చేయవలసివచ్చింది. రెండోది… ఆదివాసీలు వలస పాలనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయగలరనీ, అన్యాయంపై ఎలుగెత్తి పోరాడగలరనీ ఆ ఉద్యమం అందరికీ తెలిసేలా చేసింది. అందుకే బిర్సా ముండాను నేటికీ ఒడిశా, బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల గిరిజనులు ‘భగవాన్’గా కొలుచుకుంటున్నారు.
స్వతంత్ర సమరంలో ముండా, సంతాల్, తామర్, కోల్, భిల్ల, ఖాసీ, మిజో వంటి ఆదివాసీ గిరిజన తెగలు చేసిన పోరాటాలు అపూర్వమైనవి. కానీ వాటికి తగిన గుర్తింపే లేదు. అందుకే, వారిని గౌరవించుకునే సదుద్దేశంతో భారత ప్రభుత్వం 2021లో బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించింది. బ్రిటిష్ వలస పాలకులపై విల్లమ్ములు ఎక్కుపెట్టి పోరాడిన భగవాన్ బిర్సా ముండా పుట్టిన నవంబర్ 15ను గిరిజనుల గౌరవ దినంగా జరుపుకోవడం ఆ మహనీయుడికి, మిగతా ఆదివాసీలకూ సముచితమైన నివాళి. ఆ సందర్భంగా గిరిజనుల ఘనమైన చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను స్మరించుకుందాం. బిర్సా ముండా వారసులుగా జాతీయతావాదాన్ని అలవరచుకుందాం.





