News

ఛత్తీస్‌గఢ్‌ కవర్ధా జిల్లాలో అక్రమ చర్చిలు? 18 వనవాసీ గ్రామాల ప్రజల ఆందోళన.. కలెక్టర్‌కు ఫిర్యాదు

2views

ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధా జిల్లాలో మతపరమైన కార్యకలాపాలు, బైగా వనవాసీల సంప్రదాయ గుర్తింపుకు సంబంధించిన వివాదం తెరపైకి వచ్చింది. పండరియా బ్లాక్‌లోని కుయ్‌-కుక్దూర్ అటవీ ప్రాంతంలో 40కి పైగా ప్రదేశాల్లో అనుమతి లేని చర్చిలు, ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తున్నారని 18 గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపించారు. అంతేకాకుండా, చర్చిల నిర్మాణం కోసం ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు గ్రామస్థులు కవర్ధా కలెక్టరేట్‌కు చేరుకుని, ముఖ్యమంత్రిని ఉద్దేశించి రూపొందించిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ తులిక ప్రజాపతికి అందజేశారు. పేద వనవాసీల కుటుంబాలను ప్రలోభాలకు గురిచేస్తూ వారి సంప్రదాయ విశ్వాసాలు, స్వదేశీ సంస్కృతికి దూరం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.

వనవాసీల సంప్రదాయాల పరిరక్షణకు డిమాండ్
ప్రత్యేకించి బైగా, ఇతర వనవాసీ తెగల సాంప్రదాయ గుర్తింపు, ఆచార వ్యవహారాలు, సంస్కృతిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. తరతరాలుగా అనుసరిస్తున్న సంప్రదాయాలను వదిలివేసేలా కొందరు ప్రభావితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మిటానిన్‌లు (కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు), ఇతర ప్రభుత్వ సిబ్బంది కూడా పాల్గొంటున్నారనే ఆరోపణలు గ్రామస్థులు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేర్లతో కూడిన జాబితాను కూడా అధికారులకు అందజేసినట్లు సమాచారం.

ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అనుమతులు లేని నిర్మాణాలు, మతపరమైన కార్యకలాపాలపై అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు.తమ ఫిర్యాదుపై అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.