News

ఖురాన్ లాకెట్‌పై వివాదం.. కరీనాకు అండగా నిలిచిన హిందూ ఉత్సవ సమితి!

29views

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ దీపావళి సందర్భంగా ధరించిన పురాతన పచ్చల లాకెట్ వివాదానికి కేంద్రంగా మారింది. పవిత్ర ఖురాన్‌లోని ‘ఆయత్-ఉల్-కుర్సీ’ వాక్యాలు చెక్కిన ఆభరణాన్ని ఫ్యాషన్‌లో భాగంగా ధరించడంపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత ఒకరు లీగల్ నోటీసు పంపించారు. అయితే, ఈ వివాదంలో కరీనా కపూర్‌కు భోపాల్‌కు చెందిన హిందూ ఉత్సవ సమితి మద్దతుగా నిలిచింది. ఆమె ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

దీపావళి సందర్భంగా కరీనా కపూర్ డిజైనర్ పునీత్ బలానా రూపొందించిన ప్రత్యేక కాఫ్తాన్, తలపాగా ధరించారు. ఈ సందర్భంగా భోపాల్ రాజకుటుంబ వారసత్వానికి చెందిన విలువైన ఆభరణాలను కూడా ఆమె అలంకరించుకున్నారు. ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ రియా కపూర్ ఈ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

కరీనా ధరించిన ఆభరణాల్లో 30 క్యారెట్ల పచ్చలతో రూపొందించిన పురాతన లాకెట్‌తో పాటు సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన కల్గీ కూడా ఉన్నాయి. ఇవి ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ కుటుంబ వారసత్వ ఆభరణాలుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ నాయనమ్మ సాజిదా సుల్తాన్ భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె.

ఈ లాకెట్‌పై ఖురాన్‌లోని సూరా అల్‌ బఖరా 255వ వచనమైన ‘ఆయత్-ఉల్-కుర్సీ’ చెక్కి ఉంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది.

కరీనా, రియా కపూర్‌లకు లీగల్ నోటీసులు
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తన న్యాయవాది మహమ్మద్ జాఫర్ ద్వారా నవంబర్ 11న కరీనా కపూర్, రియా కపూర్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.సంబంధిత సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. ఇస్లామిక్ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ఖురాన్ వాక్యాలను ఫ్యాషన్ ప్రదర్శనలో భాగం చేయడం ముస్లింల మనోభావాలను దెబ్బతీసిందని హఫీజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.అయితే, ఈ నోటీసు కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరి కాదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా తమకు నచ్చిన దుస్తులు ధరించడంపై అభ్యంతరం లేదని కూడా పేర్కొన్నారు.

కరీనాకు అండగా హిందూ ఉత్సవ సమితి
ఈ వివాదంపై భోపాల్ హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారి స్పందిస్తూ కరీనా కపూర్‌కు మద్దతు ప్రకటించారు.లాకెట్‌ను మెడలో, హృదయానికి దగ్గరగా ధరించడం ద్వారా ఎలాంటి అగౌరవం జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. కరీనా కపూర్ ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.భోపాల్ రాజకుటుంబ వారసత్వంతో సంబంధం ఉన్న కుటుంబంలోకి కోడలిగా వచ్చిన కరీనాకు ఆ కుటుంబానికి చెందిన సంప్రదాయ ఆభరణాలను ధరించే హక్కు ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో సంస్కృతి బచావో మంచ్, హిందూ ఉత్సవ సమితి ఆమెకు అండగా ఉంటాయని తెలిపారు.