
మొగల్తూరు: ప్రకృతిని సంరక్షించుకోవడం ద్వారానే భావితరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించగలమని అడవి సృష్టికర్త, ప్రకృతి ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతిని ఆరాధిస్తూ జీవించడమే మన సంస్కృతి అని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మోళ్ళపర్రు గ్రామంలోని శ్రీ మత్స్య నారాయణ స్వామి దేవాలయం వద్ద గ్రామ వికాస్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నేదునూరి వెంకట సత్య శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం ద్వారా సముద్ర తీర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. సముద్ర తీరాల పరిశుభ్రతతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం ఎంతో అవసరమన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దుశర్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధిస్తూ జీవించడం తన జీవిత విధానమని పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.
సముద్ర తీర ప్రాంతాల్లో సునామీల వంటి ప్రకృతి విపత్తులను సైతం కొంతమేర ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన తీరప్రాంత మొక్కలను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తీర ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని వివరించారు.

మొక్కలు నాటండి.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి
ప్రధాన వక్తగా పాల్గొన్న గోదావరి విభాగ్ గ్రామ వికాస్ సంయోజక్ చింతాకుల గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రకృతితో మమేకమై జీవించడం భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ప్రకృతి వనరులను కాపాడుకోవడంతో పాటు భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.
సభా కార్యక్రమం అనంతరం ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. పేరుపాలెం సౌత్ నుంచి కేపీ పాలెం సౌత్ మినీ గోవా వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర 5 వేల సీడ్ బాల్స్ వెదజల్లారు.
ఈ కార్యక్రమం ద్వారా తీరప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్వాహకులు సంకల్పించారు.





