
నెల్లూరు: సనాతన ధర్మ ప్రచారం, భక్తి భావనల విస్తరణ, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భజన గురువులకు ప్రత్యేక ధార్మిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి వివిధ స్థాయిల్లోని వ్యక్తులకు, పలు విభాగాలకు చెందిన కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1, 2 తేదీల్లో నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సింహపురి జోన్ పరిధిలోని మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన భజన గురువులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. భజన సంప్రదాయాల ప్రాధాన్యం, ధార్మిక అంశాలపై అవగాహన, భక్తి మార్గంలో సమాజాన్ని నడిపించే విధానాలపై శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రాంత ప్రముఖ్ శ్రీ కొండారెడ్డి, ప్రాంత సహ సంయోజక్ ముద్దు సాయిరాం, ప్రాంత బాల వికాస్ ప్రముఖ్ శ్రీమతి అద్దంకి విజయలక్ష్మి పాల్గొన్నారు. అలాగే జోనల్ ధర్మ ప్రచారకులు శ్రీ వెంగళ్ రెడ్డి, శ్రీ ఈశ్వర్ రెడ్డి తదితరులు హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు.

భజన గురువులకు ఘన సత్కారం
రెండో రోజు కార్యక్రమంలో శిక్షణ పొందిన భజన గురువులందరినీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు, శాలువాలతో వారిని గౌరవించారు.
భజన గురువులు గ్రామీణ ప్రాంతాల్లో భక్తిభావాన్ని పెంపొందించడంలో, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.
భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ధార్మిక కార్యక్రమాల ద్వారా భావితరాలకు సనాతన ధర్మ విలువలను చేరవేయడంలో భజన గురువుల పాత్ర ఎంతో కీలకం. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ధార్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు భారతీయ భక్తి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు దోహదపడతాయి.





