News

యునెస్కో ప్రపంచ జాబితాలో మహాభారత తాళపత్రం

31views

భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. మహాభారతానికి చెందిన శతాబ్దాల నాటి అరుదైన ప్రాచీన గ్రంథం యునెస్కో ‘మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌’లో చోటు దక్కించుకుంది. భారతీయ జ్ఞాన సంపద, ఇతిహాస వైభవానికి ఈ గుర్తింపు మరింత ప్రతిష్ఠను తీసుకొచ్చింది.

మహారాష్ట్రలోని పూణేలో ఉన్న భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో భద్రపరిచిన ఈ అపురూప గ్రంథం 16వ శతాబ్దానికి చెందినది. మొత్తం 358 పేజీలతో ఉన్న ఈ ప్రాచీన ప్రతిని శారదా లిపిలో భోజపత్రంపై లిఖించారు.

1875లో జర్మన్ పండితుడు జార్జ్ బూలర్ కాశ్మీర్‌లో ఈ గ్రంథాన్ని సేకరించారు. అనంతరం ఇది భండార్కర్ సంస్థ వద్ద భద్రపరచబడింది. మహాభారతానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్రిటికల్ ఎడిషన్ రూపొందించడంలో ఈ ప్రాచీన ప్రతి కీలక ఆధారంగా నిలిచింది.

ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన యునెస్కో సమావేశంలో భారతీయ చారిత్రక, సాహిత్య సంపదకు చెందిన మూడు అమూల్య గ్రంథాలకు గుర్తింపు లభించింది. మహాభారత ప్రాచీన ప్రతితో పాటు ఆచార్య కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’, కాశ్మీరీ చరిత్రకారుడు కల్హణుడు రచించిన ‘రాజతరంగిణి’ కూడా మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో చోటు సంపాదించాయి.

ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

భారతీయ ఆధ్యాత్మిక, సాహిత్య, చారిత్రక సంపదకు ప్రపంచస్థాయిలో లభించిన ఈ గుర్తింపు ప్రతి భారతీయుడికి గర్వకారణం. వేల సంవత్సరాలుగా తరతరాలకు జ్ఞానాన్ని అందిస్తున్న మన ఇతిహాసాలు, ప్రాచీన గ్రంథాల గొప్పతనాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిన ఘనత ఇది.