
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ చరిత్రకు సంబంధించిన మరో అరుదైన శాసనం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో శాసనాల అచ్చుతీసే ప్రక్రియలో భాగంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిపుణులు ఈ చారిత్రక శాసనాన్ని గుర్తించారు.
భారత్-శ్రీ ప్రాజెక్టులో భాగంగా శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న శాసనాల పరిశీలనలో మూడో ప్రాకారం దక్షిణ గోడపై ఈ శాసనం బయటపడింది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన అచ్యుతదేవరాయల కాలం నాటి ఈ శాసనం తమిళ భాషలో ఉంది. దీనిని 1540 డిసెంబర్ 31న ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.
ఈ శాసనంలో తిరుమల శ్రీవారికి నిర్వహించే విశేష నైవేద్యాలు, ప్రసాదాలు, ఇతర సేవలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అప్పట్లో చంద్రగిరి కోట మిలిటరీ కమాండర్‌గా ఉన్న దళవాయి తిమ్మర సయ్యర్ ఈ సేవల నిర్వహణకు ఆర్థిక సహకారం అందించినట్లు శాసనంలో పేర్కొన్నారు.
గోకులగుంట-సీమలోని సమాపురం-తిన్నై గ్రామం నుంచి వచ్చే 150 బంగారు నాణేలను ఇందుకోసం స్వీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్వామివారి నైవేద్యాలు, ఇతర సేవల నిర్వహణ కోసం 15 వేల పణాలను దేవాలయ నిధికి జమ చేసినట్లు శాసన వివరాలు వెల్లడిస్తున్నాయి.
విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆలయ వైభవానికి సాక్ష్యం!
ఈ శాసనం ద్వారా విజయనగర సామ్రాజ్య కాలంలో తిరుమల శ్రీవారి ఆలయానికి అందిన ఆర్థిక సహకారం, నిత్య కైంకర్యాలు, ప్రత్యేక ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన చారిత్రక వివరాలు తెలుస్తున్నాయి.
శతాబ్దాల క్రితమే శ్రీవారి ఆలయంలో నైవేద్యాలు, ప్రత్యేక సేవల నిర్వహణకు రాజులు, సైనిక అధికారులు, దాతలు ఆర్థిక సహకారం అందించేవారని ఈ శాసనం మరోసారి గుర్తుచేస్తోంది.
తిరుమల ఆలయ చరిత్ర, విజయనగర పాలకుల భక్తి, అప్పటి దానధర్మాల సంప్రదాయాలను వెలుగులోకి తీసుకువస్తున్న ఈ అరుదైన శాసనం చరిత్ర పరిశోధకులకు మరింత ఆసక్తికరంగా మారింది.




