
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కళావైభవానికి ప్రతీకగా నిలిచే గుస్సాడీ, దండారీ ఉత్సవాలు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభమయ్యాయి. గిరిజన గ్రామాలు డప్పుల మోతలు, సంప్రదాయ నృత్యాలు, రంగురంగుల వేషధారణలతో పండుగ శోభను సంతరించుకుంటున్నాయి. జిల్లాలోని సుమారు 50 గిరిజన గూడేల్లో ఈ ఉత్సవాల సందడి నెలకొంది.
ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక్కో దండారీకి రూ.15 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. కొన్ని గ్రామాల్లో ఆదివారం నుంచే వేడుకలు ప్రారంభం కాగా, మరికొన్ని గ్రామాల్లో రాబోయే రోజుల్లో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నెమలి పింఛాల టోపీలు.. సంప్రదాయ వేషధారణలు!
గుస్సాడీ నృత్యం ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నెమలి పింఛాలు పొదిగిన ప్రత్యేక టోపీలు, తలపాగాలు, కృత్రిమ మీసాలు, గడ్డాలు ధరించి గిరిజన కళాకారులు నృత్యాలు చేస్తారు. జింక లేదా మేక చర్మంతో రూపొందించిన సంప్రదాయ వస్త్రధారణ కూడా ఈ వేడుకల్లో ప్రత్యేకత.
డప్పులతో పాటు పేప్రే, తుడుం, కాలికోం వంటి సంప్రదాయ వాయిద్యాల నాదాల మధ్య దండారీ బృందాలు సమూహాలుగా చేరి నృత్య ప్రదర్శనలు ఇస్తాయి. గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతుంది.
భోగితో ప్రారంభం.. కోలబోడితో ముగింపు!
గిరిజన సంప్రదాయంలో దండారీ ఉత్సవాల ప్రారంభ దినాన్ని భోగి పండుగగా పరిగణిస్తారు. భోగి నుంచి ప్రారంభమయ్యే వేడుకలు దీపావళి అనంతరం నిర్వహించే కోలబోడి కార్యక్రమంతో ముగుస్తాయి. బేటికోలా, మానుకోలా, సదర్కోలా, కోడల్కోలా, కలివల్కోలా వంటి పలు రకాల దండారీ నృత్యాలు ఈ వేడుకల్లో భాగంగా ఉంటాయి. మహిళలు, పురుషులు సంప్రదాయ కోలలతో కలిసి నృత్యాలు చేస్తారు. చివరి రోజు కోలబోడి సందర్భంగా గ్రామస్తులు, పెద్దలు గ్రామ శివారులోని జమ్మిచెట్టు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చెట్టుకు ఆభరణాలు కట్టి, హారతి ఇచ్చి సంప్రదాయబద్ధంగా ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.
నెమలి టోపీల తయారీలో పాటగూడకు ప్రత్యేక గుర్తింపు
గుస్సాడీ ఉత్సవాల్లో ఉపయోగించే నెమలి పింఛాల టోపీల తయారీకి కుమురం భీం జిల్లాలోని పాటగూడ గ్రామం ప్రసిద్ధి చెందింది. దాదాపు 25 ఏళ్లుగా ఇక్కడి గ్రామస్తులు ఈ టోపీలను తయారు చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనూరు, సిర్పూర్ (యు), కెరమెరి, తిర్యాణి, వాంకిడి తదితర ప్రాంతాల నుంచి గిరిజనులు ఇక్కడికి వచ్చి టోపీలు కొనుగోలు చేస్తుంటారు. ఒక్కో నెమలి పింఛం టోపీ ధర సుమారు రూ.10 వేల వరకు ఉంటుంది. ఉత్సవాల నేపథ్యంలో నెల రోజుల ముందుగానే గ్రామస్థులు టోపీల తయారీ పనులు ప్రారంభించారు.
ఆచారాలను కాపాడుకోవాలి: ఆనందరావు
గోయగాం సర్పంచ్ ఆనందరావు మాట్లాడుతూ.. దండారీ పండుగను ఎంతో నిష్టతో, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని తెలిపారు. భోగి నుంచి కోలబోడి వరకు గ్రామస్తులంతా ఒకచోట చేరి ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటారని చెప్పారు.
యువత సంప్రదాయాలను కొనసాగించాలి: మడావి శాంతబాయి
కొఠారి సర్పంచ్ మడావి శాంతబాయి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పోకడలు వస్తున్నప్పటికీ, తరతరాలుగా వస్తున్న ఆదివాసీ ఆచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా యువత ఈ సంప్రదాయాల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.





