
వాషింగ్టన్ డీసీ:భారతీయుల ఆచార వ్యవహారాలు, హిందూ సంప్రదాయాలు, గోమాత పూజపై ఇజ్రాయెల్-అమెరికన్ మత గురువు రబ్బీ యోసెఫ్ మిజ్రాచీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. భారతీయుల విశ్వాసాలను అవమానించేలా ఆయన మాట్లాడటంపై భారత్‌తో పాటు పలు దేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ మిజ్రాచీ భారతీయుల గోపూజ సంప్రదాయాన్ని అపహాస్యం చేశారు. భారతదేశంలో ప్రజలు ఇళ్లలో ఆవులను పూజిస్తారని, గోమూత్రానికి సంబంధించిన ఆచారాలను పాటిస్తారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని ఆసుపత్రులకు వెళ్లే వైద్యుల గురించి ప్రస్తావిస్తూ అవమానకరమైన పోలికలు చేశారు. వీధుల్లో తిరిగే ఆవుల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని వ్యాఖ్యానించారు. చివరగా దేవుడు తమను భారతీయులుగా సృష్టించనందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. భారతీయుల మత విశ్వాసాలు, సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని పలువురు అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో నివసిస్తున్న ఇజ్రాయెల్ పరిశోధకుడు, రచయిత యెషయా రోసెన్‌మాన్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మిజ్రాచీ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ఇజ్రాయెల్ ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు. గతంలో బ్రిటన్ అనుసరించిన వైఖరిని దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్ కూడా ఆయన దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై భారతదేశంలోని పాలస్తీనా రాయబారి కూడా స్పందించారు. ఇతరుల మత విశ్వాసాలు, నమ్మకాలు, సంప్రదాయాలను అవమానించే వ్యక్తులు మానవాళికి ప్రమాదకరమని పేర్కొన్నారు. జాతి వివక్ష మానవ సమాజానికి తీవ్ర ముప్పుగా మారుతుందని స్పష్టం చేశారు.
గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు
రబ్బీ యోసెఫ్ మిజ్రాచీ ‘డివైన్ ఇన్ఫర్మేషన్’ పేరుతో ఆన్లైన్ మత సంస్థను నిర్వహిస్తున్నారు. గతంలోనూ వివిధ మత వర్గాలు, వికలాంగులు, క్యాన్సర్ బాధితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
2015లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన హోలోకాస్ట్‌లో ప్రాణాలు కోల్పోయిన యూదుల సంఖ్యకు సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేయడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. అనంతరం ఈ విషయంపై క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.
2019లో బ్రిటన్ పర్యటనకు సిద్ధమైన సమయంలో ఆయన ప్రవేశంపై బ్రిటిష్ హోం ఆఫీస్ నిషేధం విధించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అరెస్టు అయ్యే అవకాశం ఉందనే భయంతో ఆయన తన పర్యటనను స్వయంగా రద్దు చేసుకున్నారు.





