
హరిద్వార్: సనాతన ధర్మానికి సంబంధించిన ప్రాచీన ధర్మ గ్రంథాల శుద్ధీకరణ అంశం ఇప్పుడు ధార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యోగఋషి రామ్‌దేవ్ బాబా నాయకత్వంలో హరిద్వార్‌లో నిర్వహించిన ‘ప్రాచ్య అధ్యయనాల సదస్సు’లో సనాతన సంప్రదాయ గ్రంథాలను శుద్ధి చేసేందుకు విస్తృత ఉద్యమం చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ నిర్ణయంపై జ్యోతిర్పీఠ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పలు కీలక ప్రశ్నలు సంధించారు.
సనాతన ధర్మ గ్రంథాలను శుద్ధి చేయాలనే ప్రతిపాదన వెనుక ఉన్న కారణాలను ముందుగా స్పష్టం చేయాలని శంకరాచార్య ప్రశ్నించారు. అసలు గ్రంథాల్లో దోషాలు ఉన్నాయని ఎవరు గుర్తించారు? వాటిలో ఉన్నట్లు చెబుతున్న అపవిత్రత లేదా అనధికారిక చేర్పులు ఏమిటి? ఒకవేళ అలాంటి మార్పులు జరిగితే వాటిని ఎవరు, ఎప్పుడు, ఏ ఉద్దేశంతో చేర్చారు? ఇన్నేళ్లుగా ధార్మిక సంప్రదాయాలను అనుసరిస్తున్న పండితులకు ఈ విషయాలు ఎందుకు తెలియలేదని ఆయన ప్రశ్నించారు.
గ్రంథాలను మార్చే అధికారం ఎవరికి ఉంది?
ధార్మిక గ్రంథాల సవరణకు సంబంధించి మరో కీలకమైన ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఏ గ్రంథంలో ఏ భాగం తప్పు అని నిర్ణయించే ప్రాతిపదిక ఏమిటి? వాటిని సవరించే అధికారం ఎవరికి ఉంటుంది? ఏదైనా ఒక శ్లోకం లేదా వాక్యం అభ్యంతరకరంగా ఉందని భావించినంత మాత్రాన దాన్ని తొలగించడం లేదా మార్చడం సమంజసమేనా? అలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు అనుసరించాల్సిన విధివిధానాలు ఏమిటని ప్రశ్నించారు.
పండితుల పరిశీలన అవసరం
సనాతన ధర్మానికి సంబంధించిన ప్రాచీన గ్రంథాలు తరతరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక వారసత్వ సంపద అని చెప్పవచ్చు. వాటిలోని పాఠభేదాలు, ప్రతుల మధ్య వ్యత్యాసాలు, చారిత్రకంగా జరిగిన మార్పులను పరిశీలించేందుకు భాషా పండితులు, ధర్మశాస్త్ర నిపుణులు, సంప్రదాయ పండితుల భాగస్వామ్యం అవసరం. కేవలం కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయనే కారణంతో గ్రంథాల శుద్ధీకరణకు పూనుకోవడం కంటే, అందుకు సంబంధించిన స్పష్టమైన ప్రమాణాలు, ఆధారాలు, విధివిధానాలను ముందుగా నిర్ణయించాలన్నది శంకరాచార్య లేవనెత్తిన ప్రశ్నల సారాంశం.





