
సాహస యాత్ర ‘లోకాయన్ 26’ను విజయవంతంగా పూర్తి చేసిన ‘ఐఎన్ఎస్ సుదర్శిని’కి భారత నౌకాదళం ఘనస్వాగతం పలికింది. ప్రపంచంలోని వివిధ మహాసముద్రాల గుండా 10 నెలల్లో 22వేల నాటికల్ మైళ్లకు పైగా సాగిన సుదీర్ఘ సాహసయాత్రను ముగించుకొని ఐఎన్ఎస్ సుదర్శిని నవంబర్ 2న భారత్ తీరానికి వచ్చింది. భారత నౌకాదళ సామర్థ్యాలను, శిక్షణ ప్రమాణాలను, అంతర్జాతీయ సహకారానికి మన దేశం అందిస్తున్న ప్రాధాన్యతను చాటిచెబుతూ ఈ సుదీర్ఘయాత్ర జరిగింది.
“ఈ సుదీర్ఘ ప్రయాణంలో మేము 11 దేశాల్లోని 17 ఓడరేవులను సందర్శించాం. రెండు పెద్ద అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొన్నాం. అందులో మొదటిది ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఎస్కాల్ ఎ సెట్’. అది 400 ఏళ్ల ఫ్రాన్స్ నౌకాయాన ఉత్సవం. అదే విధంగా జులై 4న అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంది. ఇందులోనూ మేము పాల్గొన్నాం. వాస్తవానికి ఈ రెండు వేడుకలకు ఆహ్వానం అందుకున్న రెండు విదేశీ నౌకల్లో మన నౌక ఉండడం మనకు దక్కిన అతిపెద్ద గౌరవం. ఆసియా ఖండం నుంచి సగం ప్రపంచం దాటి అమెరికా వరకు ప్రయాణించిన ఏకైక నౌక ఐఎన్ఎస్ సుదర్శిని మాత్రమే. ఈ 10 నెలల్లో మేము దాదాపు 22 వేల నాటికల్ మైళ్లు ప్రయాణించాం. ఇందులో 214 రోజులు సముద్రంలోనే గడిపాం. భారతదేశానికి దూరంగా 287 రోజులు ఉన్నాం” అని ఐఎన్ఎస్ సుదర్శిని కమాండింగ్ ఆఫీసర్ రవికాంత్ నండూరి చెప్పారు.
వాటర్ క్యానన్ సెల్యూట్
సాహసయాత్ర పూర్తి చేసి స్వదేశానికి చేరుకున్న ఈ నౌకకు వాటర్ క్యానన్ సెల్యూట్ సమర్పించారు. నౌకాదళ బ్యాండ్ ప్రత్యేక ప్రదర్శనతో స్వాగతం పలికింది. మరోవైపు సుదీర్ఘ యాత్ర తర్వాత, తిరిగి వచ్చిన సిబ్బందికి స్వాగతం పలికేందుకు వారి కుటుంబ సభ్యులు జెట్టీ వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ ఫ్లాగ్-ఇన్ కార్యక్రమానికి సదరన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాడింగ్-ఇన్-చీఫ్, వైస్ ఆడ్మిరల్ సమీర్ సక్సేనా అధ్యక్షత వహించారు. నౌకా సిబ్బంది చూపిన అసాధారణ పట్టుదలను, వృత్తి నైపుణ్యాన్ని, కష్టాలను తట్టుకునే శక్తిని, విధి నిర్వహణ పట్ల వారికున్న అంకిత భావాన్ని ఆయన అభినందించారు. వాళ్లు మన దేశానికి, భారత నౌకాదళానికి ఎంతో కీర్తి, ప్రతిష్టలు తీసుకువచ్చారని కొనియాడారు. ఈ సాహసయాత్ర విజయవంతం కావడం అనేది మన నౌకాదళానికి ఉన్న ఉన్నత స్థాయి శిక్షణ, సముద్రయాన నైపుణ్యం, కార్యాచరణ సన్నద్ధతను ప్రతిబింబిస్తుందని సక్సేనా అన్నారు. భారతదేశపు సంపన్న నౌకాయాన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ ప్రయాణం ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిందని ఆయన పేర్కొన్నారు.
“లోకాయన్ 26 యాత్ర 2026 జనవరి 26న ప్రారంభమైంది. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో ఐఎన్ఎస్ సుదర్శిని ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఖండాల్లోని 11 దేశాలను, 17 వేర్వేరు ఓడరేవులను సందర్శించింది. ఈ యాత్రలో రెండుసార్లు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడం జరిగింది. అంతేకాదు వివిధ రకాల సముద్ర వాతావరణాల గుండా ప్రయాణం సాగింది. ఇది సుదీర్ఘ సముద్ర నావిగేషన్‌లో ఎదురయ్యే సవాళ్లను ప్రాక్టికల్‌గా ఎలా ఎదుర్కోవాలనే అమూల్యమైన అనుభవాన్ని మన సిబ్బందికి అందించింది” అని వైస్ ఆడ్మిరల్ సమీర్ సక్సేనా అన్నారు.





