
విశాఖపట్నం:భారత్, అమెరికా దేశాల మధ్య నిర్వహిస్తున్న సంయుక్త నౌకాదళ విన్యాసాలు ‘టైగర్ ట్రయంఫ్–2026’ ఐదో ఎడిషన్ విశాఖపట్నంలో ప్రారంభమైంది. తూర్పు నౌకాదళానికి చెందిన మారిటైమ్ వార్ఫేర్ సెంటర్లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
భారీ ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇరు దేశాల సాయుధ దళాల మధ్య సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి తూర్పు నౌకాదళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ రియర్ అడ్మిరల్ విశాల్ బిష్ణోయ్, అమెరికా పసిఫిక్ ఫ్లీట్ వైస్ కమాండర్ రియర్ అడ్మిరల్ జోక్విన్ జె. మార్టినెజ్ డి పినిల్లోస్ అధ్యక్షత వహించారు.
విపత్తుల సమయంలో ఇరు దేశాల దళాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టడం, వివిధ విభాగాల మధ్య సమర్థవంతమైన సమాచార మార్పిడి, సమన్వయంతో పాటు ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించడంపై ఈ విన్యాసాల్లో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యల్లో పరస్పర సహకారాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి ఈ విన్యాసాలు దోహదపడనున్నాయి.





