
గ్రామంలో గతంలో ఎలాంటి మసీదు లేదా మదర్సా లేదని, వాటి నిర్మాణం కోసం ఎటువంటి భూమిని కేటాయించలేదని హిందూ గ్రామస్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి సమీప గ్రామాల్లోని మసీదులకు వెళ్తుంటారని తెలిపారు.
అయితే అక్టోబర్ 29 రాత్రి గ్రామంలోని ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతానికి సమీపంలోని ఖాళీ స్థలంలో మతపరమైన నిర్మాణం చేపట్టేందుకు కొందరు ప్రయత్నించారని గ్రామస్థులు ఆరోపించారు. రాత్రి పొద్దుపోయే వరకు నిర్మాణ పనులు కొనసాగినట్లు పేర్కొన్నారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదని, వెంటనే పనులు నిలిపివేసి అక్కడ ఉన్న ఇటుకలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు గ్రామస్థులు సంతకాలు చేసిన రాతపూర్వక ఫిర్యాదును పోలీసులకు అందజేశారు.
మసీదు నిర్మాణం కాదు.. కాలువ పనులంటున్న పోలీసులు
గ్రామస్థుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ మసీదు నిర్మాణం జరగడం లేదని, గ్రామ ప్రధాన్ ఆధ్వర్యంలో కాలువ నిర్మాణానికి సంబంధించి ఇటుకలతో చిన్న గోడను నిర్మిస్తున్నారని స్పష్టం చేసినట్లు సమాచారం.
దీంతో గ్రామంలో నిర్మాణానికి సంబంధించిన వివాదం చర్చనీయాంశంగా మారింది. అసలు అక్కడ చేపట్టిన పనుల స్వరూపం, అనుమతులపై అధికారుల పరిశీలనతో స్పష్టత రావాల్సి ఉంది.





