
2018లో మొదలైన వివాదం
2018 అక్టోబర్ వరకు అంజనాద్రి ఆలయ నిర్వహణ ప్రధాన పూజారి విద్యాదాస్ బాబా నేతృత్వంలోని ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో కొనసాగింది. అయితే ధర్మకర్తల మండలికి, విద్యాదాస్ బాబాకు మధ్య విభేదాలు తలెత్తడంతో అప్పటి జిల్లా యంత్రాంగం ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యాదాస్ బాబా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు ధార్వాడ ధర్మాసనం.. ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుంటూ జిల్లా యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా పేర్కొంటూ కొట్టివేసింది.
మళ్లీ తెరపైకి ఆలయ నిర్వహణ వివాదం
హైకోర్టు ఉత్తర్వుల అనంతరం విద్యాదాస్ బాబా ఆలయ నిర్వహణ బాధ్యతలను తిరిగి చేపట్టారు. జిల్లా యంత్రాంగం నియమించిన సిబ్బందిని తొలగించి, తనకు సంబంధించిన వ్యక్తులను నియమించుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో గంగావతి తాలూకాలోని అంజనాద్రి శ్రీ హనుమాన్ ఆలయానికి ప్రభుత్వ అధికారుల బృందం చేరుకుంది. ఆలయ కార్యాలయాలకు విద్యాదాస్ బాబా వేయించిన తాళాలను అధికారులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం కార్యాలయాలను జిల్లా యంత్రాంగం ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ చర్యతో ఆలయ ప్రధాన పూజారి, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంజనాద్రి ఆలయ నిర్వహణ, అధికారాలపై నెలకొన్న వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.





